అంతర్గత విభేదాలకు స్వస్తి.. పార్టీ బలోపేతానికి పని చేయాలి.

రంగంలోకి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ రమణకు బాధ్యతలు.

పెద్దపల్లి నాయకులకు హైదరాబాద్ లో క్లాస్ తీసుకున్న ఎమ్మెల్సీ ఎల్.రమణ.

చేగొండ రవి కుమార్ అగ్నిధార పత్రిక ఎడిటర్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటినుండో లోలోపల రగులుతున్న విభేదాలు శనివారం ఆర్ఆర్ గార్డెన్ సమావేశంతో బయటపడ్డాయి. సమావేశ ప్రాంగణమంతా రణరంగాన్ని తలపించింది. ఈ పరిణామం ఆదివారం మరింత ముదిరింది రచ్చగా మారింది. బీసీలను అణచివేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకుడు, ఓదెల మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్ ఆర్కే గార్డెన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో పెద్దపల్లి బీఆర్ఎస్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలపై ఎట్టకేలకు బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. నేతల మధ్య సమన్వయ లోపం, బహిరంగ విమర్శలతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రంగంలోకి దిగారు. హరీష్ రావు ఆదేశాలతో ఎమ్మెల్సీ ఎల్.రమణ పెద్దపల్లి వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను చేపట్టారు.

హైదరాబాద్ లో కీలక భేటీ

ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లో కీలక భేటీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు గంట రాములు యాదవ్, దాసరి ఉషలను ఎమ్మెల్సీ ఎల్.రమణ ప్రత్యేకంగా పిలిపించుకుని చర్చించారు. గంటకు పైగా సాగిన ఈ భేటీలో రమణ ముగ్గురు నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్సీ ఎల్ రమణ కీలక సూచనలు..

సమావేశంలో ఎల్.రమణ పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

–అపోహలు వద్దు, సమన్వయంతో పని చేయాలి:

నాయకులెవరైనా పార్టీ కోసం కార్యకర్తల కోసం నిస్వార్ధంగా పనిచేయాలన్నారు. వ్యక్తిగత అపోహలు, విభేదాలు వీడి సమన్వయంతో వెళ్లాలని సూచించారు.

ఒకరికొకరు గౌరవించుకోవాలి:

నాయకులు ఒకరికొకరు గౌరవించుకుంటూ కార్యకర్తలకు ఆదర్శంగా నిలవాలని, అండగా ఉంటారనే భరోసా ఇవ్వాలని అన్నారు. కలిసి పనిచేస్తే ఎలాంటి అపోహాలు ఉండవన్నారు.

–అందరినీ కలుపుకుని పోవాలి:

మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందరినీ కలుపుకుని పోవాలని, సూచించారు. గంట రాములు యాదవ్, దాసరి ఉష , ముఖ్య నాయకులు ఎవరైనా కలిసి రావాలని అన్నారు. అంతిమంగా అందరూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.

–పార్టీ బలోపేతమే లక్ష్యం:

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతోందని, ఇలాంటి సమయంలో అంతర్గత కలహాలు వద్దని, పార్టీని బలోపేతం చేస్తూ నాయకులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.పార్టీ లైన్ దాటి పనిచేయవద్దని, పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని రమణ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ రావు, రమణ జోక్యంతో పెద్దపల్లిలో నెలకొన్న విభేదాలకు తెరపడినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.