నిబంధనలకు విరుద్ధంగా అధికారాలు దుర్వినియోగం. 

15 రోజుల్లో సంజాయిసి ఇవ్వాలి

షోకాజ్ నోటీస్ కు స్పందించకుంటే పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37(5) అమలు. 

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, అక్టోబర్ 08: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్యాగేటి రాజేశ్వరి, ఉప సర్పంచ్ ఎలిగేటి మల్లేశం లకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం 7-10-2026 .. ఏ5/2303/2026 ద్వారా షోకాజ్ నోటీసు జారీ చేశారు. గ్రామానికి చెందిన మేడవేని తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపి నివేదిక సమర్పించారు.సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుండి గ్రామ పంచాయతీ రికార్డులు అసెస్‌మెంట్ రికార్డులు అప్‌డేట్ చేయకపోవడం, కొత్త ఇంటి అనుమతులు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విచారణ నివేదిక ఆధారంగా సర్పంచ్, ఉప సర్పంచ్ లు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని నియమ నిబంధనలు పాటించకుండా, తమకు ఉన్న అధికారాలను దుర్వినియోగం చేసినట్లుగా కలెక్టర్ ఇచ్చిన షోకాజు నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37(5) ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేస్తూ 15 రోజుల్లోగా సంజాయిషీ సమర్పించాలని ఇరువురిని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సంజాయిషీ ఇవ్వని యెడల అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయని నోటీసులో హెచ్చరించారు.