ఆధార్ కార్డుల్లో రాష్ట్రం పేరును ‘ఆంధ్రప్రదేశ్’ నుంచి ‘తెలంగాణ’గా సవరించేందుకు 60 రోజుల గడువు

అగ్నిధారన్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా
ఆధార్ కార్డుల చిరునామాలో రాష్ట్రం పేరును ‘ఆంధ్రప్రదేశ్’ నుంచి ‘తెలంగాణ’గా సవరించేందుకు ప్రతిపాదిత ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సమన్వయంతో ఈ సవరణ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలకు చెందిన ప్రభావిత నివాసితుల ఆధార్ చిరునామాల్లో రాష్ట్రం పేరును సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ఈ ప్రక్రియలో భాగంగా, ప్రజలకు పబ్లిక్ నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 60 రోజుల పాటు స్వచ్ఛందంగా చిరునామా సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.కాబట్టి, సంబంధిత నివాసితులు తమ ఆధార్ కార్డుల్లోని చిరునామా వివరాలను పరిశీలించుకుని, రాష్ట్రం పేరు ‘ఆంధ్రప్రదేశ్’గా ఉంటే నిర్దేశించిన గడువులోగా ‘తెలంగాణ’గా సవరించుకోవాలని సూచించారు.60 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా స్వచ్ఛందంగా సవరణ చేసుకోని వారి ఆధార్ చిరునామాల్లో రాష్ట్రం పేరును ‘తెలంగాణ’గా UIDAI స్వయంచాలకంగా సవరించే ప్రక్రియ చేపడుతుందని తెలిపారు.ఈ మార్పు రాష్ట్రం పేరు వరకు మాత్రమే పరిమితమవుతుందని వివరించారు.అలాగే, సంబంధిత ప్రాంతాల పిన్‌కోడ్‌ల వివరాల్లో ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు జిల్లా అధికారులు పరిశీలన చేపడుతున్నారని పేర్కొన్నారు.y ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ ఆధార్ చిరునామా వివరాలను ముందుగానే తనిఖీ చేసుకుని, అవసరమైన సవరణలు చేసుకునేందుకు 60 రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.