పెద్దపల్లి: అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ధర్మారం మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన వార్డు సభ్యుడిపై జిల్లా కలెక్టర్ కొరడా ఝళిపించారు!
ధర్మారం మండలంలో ధర్మారం గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యుడు నూనె సాయి గణేష్ ను తన పదవి నుండి సస్పెండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామపంచాయతీలో
అవకతవకలపై ఫిర్యాదు.
ధర్మారం గ్రామపంచాయతీకి చెందిన 2026-27 డిమాండ్ రిజిస్టర్ లో ఇంటి నంబర్లు, అసెస్‌మెంట్ నంబర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో పెద్దపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించడంతో ఈవిషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్లు కేటాయింపు.
అధికారుల విచారణలో 153, 154, 173, 186 అసెస్‌మెంట్ ఇంటి నంబర్లను నిబంధనలకు విరుద్ధంగా నూనె మంజుల, సమాల అనిల్, గుర్రాల స్వరూప, నూనె శ్రీనివాస్ పేర్ల మీద నమోదు చేసినట్లు వెళ్లడైంది.దీనికి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుడైన 11వ వార్డ్ మెంబర్ సాయి గణేష్ కారణమని, ప్రజలకు జవాబుదారితనంతో ఉండాల్సిన వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని నివేదికలో పేర్కొన్నారు.
ఎఫ్ ఐ ఆర్ నమోదు.
ఈ వ్యవహారంలో అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శినీ అలాగే ప్రస్తుత కార్యదర్శి,తో పాటు ఈ-పంచాయతీ ఈ పంచాయతీ ఆపరేటర్ల వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి లాగిన్ ఐడి పాస్వర్డ్ తస్కరించబడిందని పంచాయతీ కార్యదర్శి ధర్మారం పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేశారు.
పంచాయతీరాజ్ చట్టం 2018, సెక్షన్ 37(6) ప్రకారం సస్పెన్షన్ వేటు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి ప్రజల సంక్షేమం కోసం బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి తన అధికార స్థానం దుర్వినియోగం చేసి ఇతరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా అసెస్మెంట్ నెంబర్ల నమోదు ప్రక్రియలో జోక్యం చేసుకొని అక్రమాలకు పాల్పడటం జరిగిందని విచారణలో తేలింది. తేలిన అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, సెక్షన్ 37(6) ప్రకారం ధర్మారం 11వ వార్డు సభ్యుడు లోని సాయి గణేష్ ను సస్పెన్షన్ వేటు వేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు లేదా 6 నెలల వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ అందులో పేర్కొన్నారు. సస్పెన్షన్ అమలు బాధ్యతను ధర్మారం మండల అభివృద్ధి అధికారికి అప్పగించారు. జిల్లాలో మొదటిసారి ఒక వార్డు సభ్యుడు సస్పెన్షన్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ధర్మారం మేజర్ గ్రామపంచాయతీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ.
ఇదే విషయంలో గతంలో ధర్మారం మేజర్ గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఈ పంచాయతీ ఆపరేటర్ సస్పెన్షన్కు గురయ్యారు. అప్పుడు అధికారుల మీద వేటు పడింది. ఇప్పుడు ప్రజా ప్రతినిధి మీద వేటు పడింది. అతిపెద్ద గ్రామపంచాయతీ మండల కేంద్రం కావడం ఇక్కడ ఇలాంటి అవకతవకలు జరగడం అధికారులతో పాటు ప్రజా ప్రతినిధి సస్పెన్షన్ కావడం ఉత్కంఠ రేపుతుంది.
సర్పంచ్ ఉప సర్పంచ్ లపై ఫిర్యాదు
ఇదే మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ ఉప సర్పంచ్ లపై గ్రామానికి చెందిన మేడగోని తిరుపతి అనే వ్యక్తి కొత్త ఇంటి అనుమతులు 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలో అవకతవకలు జరిగాయి అంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి డివిజనల్ అధికారి విచారణ జరిపారు. అ నివేదిక ఆధారంగా సర్పంచ్ ఉప సర్పంచ్ లు ఇద్దరు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని నియమ నిబంధనలు పాటించకుండా అధికార దుర్వినియోగం చేసినట్లుగా జిల్లా కలెక్టర్ గుర్తించి ఇరువురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37 (5) ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 15 రోజులలో సంజాయిసి తెలుపాలంటూ ఈనెల ఏడవ తేదీన నోటీసులు జారీ చేశారు. ధర్మపురి నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధర్మారంలో రోజురోజుకు ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠత రేపుతుంది.
