వెనక్కి తగ్గని మచ్చ పేట రైతు.. నాలుగు ఎకరాల్లో నారుమడి సిద్ధం.

నీటి కష్టాలు తప్పవు వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరిక.

కష్టమైన నష్టమైన వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతు రాములు.

పెద్దపల్లిజిల్లా:ముత్తారం ( అగ్నిధార ) ప్రకృతిలో వచ్చిన పెను మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అనిచ్చితి, వాతావరణ అసమానతలు యావత్ జీవరాశి పైన ప్రభావం పడింది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బ్రతికె రైతన్నలకు ఇది పెద్ద విప్పత్తే గడ్డు కాలం. తెలంగాణ వ్యాప్తంగా వర్షాకాలంలో69.90 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. కోతలు చివరి దశలోకి వచ్చాయి. మరోవైపు రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్న వేళ, వాతావరణ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు ఎల్ నినో హెచ్చరికలు జారీ చేయడం, అధికారులు నీటి కరువు ఉంటుందని చెప్పడంతో, చాలా మంది రైతులు సాగుపై వెనకడుగు వేస్తున్నారు. ఆరు తడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడక్కడ భూములు బీడుగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి ఓదెల సుల్తానాబాద్ జూలపల్లి ఎలిగేడు ధర్మారం రామగుండం అంతర్గాం పాలకుర్తి కాల్వ శ్రీరాంపూర్ కమాన్పూర్ రామగిరి మంథని ముత్తారం 14 మండలాలలో రైతులు ఆరుతడి పంటలతో పాటు, అక్కడక్కడ వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన ఒక రైతు వర్షాకాలం పంట విడుపు కాగానే నారుమడి దున్నుతూ యాసంగికి సిద్ధమవుతున్న దృశ్యం కనిపించింది. రైతు అగ్నిధార ప్రతినిధితో మాట్లాడారు. కీసరి రాములు. వయసు 55 ఏళ్లు. గత 30 ఏళ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నాడు. ప్రస్తుతం తన నాలుగు ఎకరాల పొలంలో యాసంగి వరి సాగు కోసం నారుమడి తయారు చేస్తున్న దృశ్యం అగ్నిధార కెమెరాకి కనిపించింది.

Peddapalli farmer preparing paddy
ఒకపక్క వరి మరోపక్క నారుమడికి సిద్ధం అవుతున్న దృశ్యం.

ఎల్ నినో అంటే ఏంటి? రైతులకు ఎందుకు భయం?

ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి అసమాన తల వల్ల వచ్చే మార్పు ఎల్ నినో. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడన వాతావరణ పరిస్థితులతో యావత్ జీవరాశిపై దీని ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. వర్షాకాలంలో వర్షాలు తగ్గి, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగి వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. తాగునీటి సాగునీటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో యాసంగిలో సాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. బోర్లు, బావుల్లో నీటి మట్టం పడిపోతుందని, చెరువులు కుంటలు ఎండిపోతాయని, రైతులు ఆచితూచి సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆరుతడి పంటలు వేసుకోవడం మంచిది అని చెబుతున్నారు. లేదంటే భూములు బీడుగా ఉంచుకుంటే రైతులకు నష్టం వాటిల్లదని అధికారులు చూసిస్తున్నారు.

అధికారులు వద్దని చెప్తున్నారు.. నేను సాగు చేస్తున్నా..

అధికారులు వరి సాగు చేయవద్దని చెబుతున్నారు, తాను మాత్రం తప్పనిసరి పరిస్థితులలో సాగు వరి సేవ చేస్తున్నానని కీసరి రాములు అగ్నిధార ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. “లాభమైనా, నష్టమైనా వ్యవసాయమే నా ప్రధాన జీవన ఆధారం. వ్యవసాయం చేయక తప్పని పరిస్థితి. భూమి బీడు ఉంటే ఖాళీగా కూర్చుంటే కుటుంబం ఎలా గడుస్తుంది? అందుకే పంట పండుతుందనే ఆశతో సాగు చేస్తున్నాను. అధికారులు వరి పంట వద్దని చెప్తున్నారు. కానీ వరి పంట పండుతుందని నమ్మకముంది. అని ఆయన ధైర్యంగా చెప్పారు. కష్టమైన నష్టమైన రైతు భరించాల్సిందే అన్నారు.

వానకాలంలో మంచి దిగుబడి.. ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి..

ఖరీఫ్ సీజన్ లో తన నాలుగు ఎకరాల పొలంలో వరి పంట చాలా బాగా పండించానని అన్నారు. మంచి దిగుబడి వచ్చిందని రాములు సంతోషంగా చెప్పాడు. ప్రభుత్వం రైతుకు మేలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మద్దతు ధర ప్రకటించి క్వింటాలకు 500 రూపాయల ఇవ్వడం సంతోషంగా ఉంది ఆనందపడ్డాడు. “ఆ దేవుడి దయవల్ల ఇప్పటికీ నా బోరు బావిలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ భూగర్భ జలాలు కూడా మీదనే ఉన్నాయని తెలిపారు. అందుకే ఈ ధైర్యం వచ్చిందన్నారు. రేపు కష్టమైనా, నష్టమైనా ప్రభుత్వాన్ని నిందించే పని చేయను. ఎండినా, పండినా అది నా కష్టం, నా ఇష్టం. బాధ లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

రైతులకు ఏం చెబుతున్నారు?

కీసరి రాములు లాంటి రైతులను చూసి మిగతా రైతులు కూడా ధైర్యం తెచ్చుకోవాలని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం కూడా యాసంగి రైతులకు రైతు భరోసా, ఉచిత కరెంట్ వంటి పథకాలతో అండగా ఉంటుందని హామీ ఇస్తోంది. ఎల్ నినో ప్రభావంతో నీటి కొరత వచ్చే ప్రమాదం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మొత్తానికి రైతుల్లో ఎల్ నినో భయం వెంటాడుతున్న వేళ, మచ్చుపేట రైతు కీసరి రాములు చూపిస్తున్న తెగువ మాత్రం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా