కలెక్టరేట్ సమీపంలో తప్పిన భారీ ప్రమాదం

బస్సు యాక్సిడెంట్ లో 20 మంది సురక్షితం

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటున్న ప్రయాణికులు.

పెద్దపల్లి:అగ్నిధార న్యూస్  ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో 20 మంది ప్రయాణికులతో పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి కరీంనగర్ వైపు వెళ్తుంది. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రయాణికులందరూ ఒకేసారి అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని అరుపులు కేకలు పెట్టారు. అప్రమత్తమైన డ్రైవర్ సాగర్ తేరుకొని బస్సుని కంట్రోల్ చేశారు. ఈ ఘటనలో బస్సులో పయనిస్తున్న ప్రయాణికులకు అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సాగర్ అగ్నిధారకు చెప్పిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి బస్సు ని డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నానన్నారు. యాక్సిడెంట్ జరగడానికి  30 మీటర్ల దూరం ఉండగానే ఒకేసారి కళ్ళు తిరిగినట్టు అయిందన్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వివరించారు. బస్సు అదుపుతప్పుతున్నట్లు అనిపించిందన్నారు. పెను ప్రమాదం జరుగుతుందని గ్రహించి వెంటనే అతి కష్టం మీద బస్ ని అదుపు చేశానన్నారు. లేనట్లయితే ముందున్న మరో చెట్టును విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టేదని తీవ్రమైన ప్రమాదం జరిగేది అని వివరించారు. ప్రయాణికులకు ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదని తెలిపారు. బస్సు మాత్రం పాక్షికంగా ధ్వంసం అయిందన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను దింపి కరీంనగర్ వైపు వెళ్లే మరో బస్సులో  పంపించామని కండక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఆదివారం రాత్రి 10 గంటలకి పెద్దపల్లి నుండి కరీంనగర్ వైపు  బయలుదేరిన గోదావరిఖని బస్సు  డిపోకు చెందిన ts0z0292 నెంబర్ గల ఆర్టీసీ బస్సు రంగంపల్లి దాటి కలెక్టరేట్ కు సమీపానికి  చేరుకుంది. రాజీవ్ రహదారి పక్కన గల మోరి వద్దకు చేరుకోగానే బస్సు ప్రమాదపుటంచలోకి చేరుకుంది. రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొని ముందుకు వెళ్ళి మరో చెట్టును ఢీకొని ఆగిపోయింది. రోడ్డు పక్కనే గ్యాస్ పైపులు ఉన్నాయి. ఆ పక్కనే మురికి కాలువ ఉంది.సమాచారం అందుకున్న గోదావరిఖని డిపో ఆర్టీసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.

ఒక్కసారి ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

ఈప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు అంటున్నారు. ఒకవేళ ఇదే ప్రమాదం పగటిపూట జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలం పక్కనే మురికి కాలువ ఉంది అందులో బస్ పడినట్లయితే ప్రమాద తీవ్రత మరో విధంగా ఉండేదని ప్రయాణికులు భయం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షించాలని, రాత్రిపూట డ్యూటీ చేసే డ్రైవర్లకు తగిన విశ్రాంతి కల్పించాలని ప్రయాణికులు అన్నారు.ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులో సాంకేతిక లోపం ఉందా, డ్రైవర్ ఆరోగ్య సమస్యే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటన ప్రాంతానికి సహాయ చర్యల నిమిత్తం ఆర్టీసీ అధికారులతో పాటు స్థానిక పోలీసులు 108 సిబ్బంది చేరుకున్నారు.

చెగొండ రవి కుమార్ యాదవ్ అగ్నిధార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా