రాత్రికి రాత్రే లక్షల విలువైన చేపలు మాయం.. నాలుగైదు లక్షల రూపాయల నష్టం?
బయట వ్యక్తుల పనా? గ్రామంలోనే ఎవరి హస్తమైనా ఉందా? కొత్తపల్లిలో కలకలం!
పెద్దపల్లి, నవంబర్ 16 (అగ్నిధార న్యూస్)
కుంటలో పెంచిన చేపలు చేతికొచ్చే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షలాది రూపాయల విలువైన చేపలను పట్టుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో కలకలం రేపుతోంది. కష్టపడి పెట్టుబడి పెట్టి చేపల పెంపకం చేపట్టిన ఇద్దరు భాగస్వాములకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు నుంచి 5 లక్షల రూపాయల విలువైన చేపలు మాయమైనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు లక్షల పెట్టుబడి.. చేతికొచ్చిన చేపలు!
కొత్తపల్లి గ్రామానికి చెందిన సబ్బు మల్లయ్య, రవి అనే ఇద్దరు భాగస్వాములు కలిసి గ్రామంలోని కేశినారికుంటలో సుమారు ఏడాదిన్నర క్రితం రెండు లక్షల రూపాయల విలువైన చేప పిల్లలను కుంటలో వదిలారు . అప్పటి నుంచి వాటిని సంరక్షిస్తూ పెంచుతున్నారు. ప్రస్తుతం చేపలు ఒక్కొక్కటి సుమారు 1 కిలో పైనే బరువు పెరిగినట్లు సబ్బు మల్లయ్య తెలిపారు. చేపలను విక్రయించి పెట్టుబడితో పాటు లాభాలు పొందాలనే ఆశతో ఉన్న భాగస్వాములకు దీనితో ఊహించని షాక్ తగిలింది.

రాత్రికి రాత్రే ఖాళీ అయిన కుంట!
ఈ సందర్భంగా సబ్బు మల్లయ్య అగ్నిధారతో మాట్లాడుతూ…చేపల పట్టడానికి అనుకూలంగా ఉండే విధంగా వారం రోజుల క్రితం చెరువులో ఉన్న తుంగ, తూడితీగ 6 మంది కూలీలను పెట్టి తీసివేసి ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కుంట వద్దకు వెళ్లి చూడగా చేపలు అంతగా కనిపించకపోవడంతో ఒక్కసారి కంగు తిన్నామన్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు కుంటలోకి ప్రవేశించి చేపలను పట్టుకెళ్లినట్లు మల్లయ్య అన్నారు. కుంటలో చేపలు పూర్తిస్థాయిలో లేకపోవడం చూసి ఒకసారి తీవ్ర ఆందోళనకు గురయ్యమన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
బయట వ్యక్తులా? గ్రామంలోనే ఎవరి సహకారమైనా ఉందా?
కుంటలో పెంచుకున్న చేపలు రాత్రికి రాత్రే ఇంత పెద్ద మొత్తంలో ఎవరు పట్టుకెళ్లడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ వ్యవహారం బయట వ్యక్తుల పనా? లేక గ్రామానికి చెందిన మరెవరైనా ఇందులో భాగస్వాములయ్యారా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. చెరువులో చేపలు పెరుగుతున్న విషయం, అలాగే వాటిని విక్రయిస్తారు అని విషయం తెలిసిన వారే ఈ పని చేసే అవకాశం ఉందా? లేక ఇంకెవరైనా చేశారా అనే అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చకు వస్తున్నాయి.
బాధితులకు న్యాయం జరిగేనా?
స్వయం ఉపాధిలో భాగంగా ఏడాదిన్నర పాటు కష్టపడి దాన పెట్టి పెంచుకున్న చేపలను రాత్రికి రాత్రి కోల్పోవడంతో ఇద్దరు భాగస్వాములు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల విలువైన చేపలు ఒక్కసారిగా మాయమైన. ఈ ఘటనపై సంబంధిత అధికారులు, స్పందించి విచారణ చేపట్టాలని, చేపలను పట్టుకెళ్లిన దొంగలు ఎవరు అనేది గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కష్టపడి పెంచిన చేపలు రాత్రికి రాత్రే మాయమవడం వెనుక అసలు కథ ఏమిటి? ఈ చేపల చోరీ వెనుక ఉన్నది ఎవరు? అనేది వెలుగులోకి వస్తాయా? వేచి చూడాలి! ఈ వ్యవహారంపై పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.
చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా.
