ట్రాన్స్ఫార్మర్ల …చుట్టూ కంచెలు కరువు.!
పెద్దపల్లి జిల్లాలో 27 సబ్ డివిజన్లో 18785 ట్రాన్స్ఫార్మర్లు.
కంచెలు లేకుండా, హెచ్చరిక బోర్డు లేకుండా దర్శనం.
పంట పొలాలు, రహదారుల పక్కన జన సమూహాల మధ్య కానరాని హెచ్చరిక బోర్డులు.
పెద్దపల్లి:అగ్నిధారన్యూస్: పెద్దపల్లిలో ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ లు జిల్లాలో 18,785 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేదు. దీనితో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం బహిర్గతమైంది. నిధుల లేమినో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమో, పట్టింపులేని తనమో కానీ, జిల్లాలో ప్రధాన రహదారుల పక్కన, పంట పొలాలలో జన సమూహాల మధ్య ఉన్న , ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు లేకుండా విద్యుత్ అధికారులు గాలికి వదిలేశారు.
జిల్లాలో 27 సబ్ డివిజన్ లు మూడు డివిజన్ల పరిధిలో అధికారులు చెప్పిన, అగ్నిధార ఫీల్డ్ వెరిఫికేషన్ లెక్కల ప్రకారం మొత్తం 18785 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అగ్నిధార వివిధ మండలాల గ్రామాలలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సందర్శనలో సింహభాగం ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు లేకుండా, హెచ్చరిక బోర్డు లేకుండా, చుట్టూ గడ్డి పెరిగి నిర్వహణ లోపంతోఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ప్రమాదకరంగా దర్శనమిచ్చాయి. వాటిని పట్టించుకునే అధికారులే కరువయ్యారు.
కానరాని రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు.
నిబంధనల ప్రకారం ప్రతి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇనుప కంచె, ముందు ప్రమాద హెచ్చరిక బోర్డు తప్పనిసరిగా ఉంచాలి. కానీ జిల్లాలో ఎక్కడ చూసినా ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ చర్యలు కనిపించవు.
పొలాల వెంట తిరిగే రైతులు, పశువుల కాపర్లు, రోడ్ల వెంట వెళ్లే వాహనదారులు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను చూసి భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో రక్షణ చర్యలు లేకపోవడం కరెంట్ డీజిల్ లీకేజీ, భయంతో పొలాల్లోకి వెళ్లే రైతులు వణికిపోతున్నారు.
ప్రమాదం జరిగితే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారు..!
దురదృష్టవశాత్తు అనుకోని ప్రమాదం జరిగి ఎవరైనా మృతి చెందితే, ఎనిమిది లక్షల రూపాయలు, పశువులు గేద నలభై వేలు, మేకకు 7000 వేల రూపాయలు విద్యుత్ శాఖ అధికారులు హడావుడిగా నష్టపరిహారం ప్రకటిస్తారు. ప్రాణం ఖరీదు పైసలేనా… ప్రాణ నష్టం జరగకముందే… రక్షణ కంచెలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని అగ్నిధార ట్రాన్స్ఫార్మర్ల సందర్శనలో ప్రజలు మొరపెట్టుకున్నారు. అధికారులను ప్రశ్నిస్తున్నారు. పరిహారం కంటే ప్రాణ రక్షణే ముఖ్యమనే విషయాన్ని అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారో తెలుపాలని రైతులు, రైతు సంఘం సంఘా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాణాలను హరించేలా ట్రాన్స్ఫార్మర్లు
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామం నుండి కొలనూరు వెళ్లే దారిలో పెద్దపల్లి మండలం కొత్తపల్లి వద్ద రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ కనీసం రక్షణ కంచేగాని హెచ్చరిక బోర్డు లేకపోవడం చూపరులకు విస్మయాన్ని కలిగిస్తుంది. ప్రతినిత్యం వందలాదివాహనాలు, స్కూల్ పిల్లల బస్సులు ఈదారి వెంట వెళ్తుంటాయి. దురదృష్టవషత్తు వాహనాలు అదుపుతప్పి రోడ్డును ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొన్నట్లయితే ఎంతటి ప్రమాదం వాటిల్లుతుందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే కొత్తపల్లి ఉప్పరపల్లి కు వెళ్లే మధ్యలో రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడం రక్షణ చర్యలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు

పెద్దపల్లిజిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేదు.
పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలు 27 సబ్ డివిజన్లో మూడు డివిజన్ల పరిధిలో 18785 ఉన్నాయి. దాదాపు పది శాతం ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే అలంకారపాయంగా రక్షణ చర్యలు చేపట్టి, మిగతా 90 శాతం ట్రాన్స్ఫార్మర్లకు ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే గాలికి వదిలిపెట్టారని అగ్నిధారతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా ప్రజల డిమాండ్:
మా ప్రాంతంలో మా చుట్టూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఎస్ ఇ వెంటనే స్పందించి, తక్షణమే వాటి చుట్టూ రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనట్లయితే రేపు ఏ ప్రమాదం జరిగినా పూర్తిస్థాయి బాధ్యత విద్యుత్ శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైతు సంఘ నాయకులు మాడుగుల మల్లయ్య డిమాండ్ చేశారు.
పెద్దపల్లి ఎస్ ఈ గంగాధర్ వివరణ
ఇదే విషయమై పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఈ గంగాధర్ ను అగ్నిధార ప్రతినిధి వివరణ కోరగా జిల్లాలో ముందు అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపిస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటివద్ద రక్షణ చర్యలు చేపడతామన్నారు. అగ్నిధార పత్రికతో పాటు, ప్రజలు తమ దృష్టికి వచ్చిన విద్యుత్ సమస్య ఏదైనా నేరుగా తనకు తెలుపవచ్చు అని అన్నారు.
ఏది ఏమైనా అగ్నిధార క్షేత్రస్థాయి సందర్శనలో గుర్తించిన విషయాలు గ్రామీణ ప్రాంతంలో ఏ ఒక్క విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కి కంచ కాని హెచ్చరిక బోర్డు కానీ కనిపించలేదు. అక్కడ అక్కడ పట్టణ ప్రాంతంలో మాత్రం అక్కడక్క జన సమూహాలు ఉన్న ప్రదేశాల్లో రక్షణ చర్యలు హెచ్చరిక బోర్డులు కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ శాఖ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడింది. ఇప్పటికైనా ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే ముందస్తుగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అగ్నిధార పత్రిక బృందం విద్యుత్ అధికారులకు సూచిస్తుంది. వెంటనే చర్యలు చేపట్టాలని ఆశిస్తుంది.
