పెద్దపల్లి, అక్టోబర్ 24 (అగ్నిధార ):

పెద్దపల్లి జిల్లాలో 2.15 లక్షల వరి పంట రైతులు సాగు చేశారు. పంటలు ఎండిపోతాయన్న దశలో డి 83d6 కాలువల ద్వారా 10 రోజులు నీళ్లు వదలడంతో 1.15 లక్షల ఎకరాల వరి పంట బతికి బయటపడ్డాయి
రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ అగ్నిధారతో చెప్పిన లెక్కల ప్రకారం రెండు లక్షల 15 వేల ఎకరాల వరి పంట 51, 246 ఎకరాల పత్తి రైతులు సాగు చేశారు. వరి పంట పాలు తాగే చివరి దశలో ఎల్ నినో ప్రభావం పెద్దపల్లి జిల్లాలో వర్షాలు కురవకపోవడం బావులు, వ్యవసాయ బోరు బావులు వాగులు,వంకలు చెరువులు,కుంటలు అడుగంటాయి. నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోతాయని రైతులలో ఆందోళనలు, గ్రహించిన పెద్దపల్లి జిల్లాకు ప్రజా ప్రతినిధులు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, రంగంలోకి దిగి రైతుల పంట పొలాలను రక్షించే కార్యక్రమం చేపట్టారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని కలిసి పంట పొలాల రైతుల పరిస్థితులను వివరించారు. కాలువ నీరు అందించాలని కోరారు. దీనితో జగిత్యాల పెద్దపల్లి జిల్లాలలో డి 83 డి 86 కాలువల ద్వారా నీరు విడుదల చేయాలని ఉత్తంకుమార్ రెడ్డి అధికారులు ఆదేశించారు.

   శాఖల సమన్వయం

పెద్దపల్లి జిల్లాలో ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 10 రోజులపాటు నిరంతరాయంగా నీటి సరఫరా చేసి పంట పొలాలను నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రక్షించారు. గత నాలుగు రోజుల క్రితం వరకు వచ్చిన కాలువ నీళ్లతోనే జిల్లాలో దాదాపు ఒక్క లక్ష 15 వేల ఎకరాల పొలాలను కాపాడగలిగారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు ఎకరాల రైతు ఓదెల సందీప్ ఆనందం

డి83 ఆయకట్టు చివరి భూమి రైతు, శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన యువరైతు ఓదెల సందీప్ తన 4 ఎకరాల పొలంలో నిలబడి అగ్నిధారతో మాట్లాడుతూ… పంట పాలు తాగే కీలక దశలో ఉండగా పొలానికి నీరు అందదేమో..అని పెట్టుబడులతో పాటు పంట నష్టం జరుగుతే అప్పుల పాలవుతామని భయపడ్డాను అని తెలిపారు. పంట చివరి దశలో డి83 కాలువ ద్వారా నీళ్లు అందడంతో పంట పండింది నాకు ధైర్యం వచ్చింది అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పెద్దపల్లి, జిల్లాలోని 14 మండలాలలో గల గ్రామాలకు డీ-83 డి 86 కాలువల ద్వారా కాలువలకు, వాగులకు నీరు చేరడంతో రైతులు పొలాలకు నీళ్లు పారించుకున్నారు. అయితే ప్రస్తుతం నాలుగు రోజుల క్రితం కాలువ నీరు బంద్ అయినప్పటికీ. వచ్చిన పది రోజులలో ఆయకట్టు చివర భూములన్నింటికీ నీరు అందడంతో రైతులు పంట పొలాలకు పారించుకున్నారు. ఎండల ప్రభావం ఎక్కువ ఉండడం సకాలంలో నీరు అందడంతో పంట పొలాలు బతికి బయటపడ్డాయని రైతులు అగ్నిధారతో ఆనందంగా చెబుతున్నారు.

మూడు ఎకరాల సన్న వడ్ల రైతు కలవేన మల్లయ్య ఏమన్నారంటే…

పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు కలవేన మల్లయ్య అగ్ని ధార ప్రతినిధితో మాట్లాడుతూ.. తను వరి పంట వేసిన మూడు ఎకరాల పొలంలో ఈసారి సన్న వడ్లు (సన్న రకం వడ్లు) వేశాను అన్నారు.. ప్రస్తుతం ఆ పంట చాలా కీలకమైన దశలో ఉంది అని తెలిపారు. వరి పంట పాలు పోసుకునే దశ, అంటే వరిగింజ పాలు పట్టే దశలో ఉంది అని తెలిపారు. ఈ దశలో నీరు లేకపోతే పంట పూర్తిగా ఎండిపోయి, గింజ తాలుగా మారిపోతుంది.
“మండుటెండలతో పంట ఎండిపోతుందేమోనని చాలా భయపడ్డాను అన్నారు. సరిగ్గా అదే సమయంలో డీ-83 కాలువకు నీళ్లు వచ్చాయి. వెంటనే నేను పండించే మూడు ఎకరాల పొలానికి కష్టపడి నీళ్లు పారించుకున్నాను అని సంతోషంగా తెలిపారు. ఇప్పుడు కాలువ నీళ్లు బంద్ అయినా, నా పంట మాత్రం పచ్చగా బతికి ఉంది ఇప్పుడు నీళ్లు అవసరం లేదు ఒక వారం రోజుల్లో పంట చేతికి వస్తుంది అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నీళ్లతోనే పంటకు మేలు జరిగింది” అని రైతు కలవేన మల్లయ్య అగ్నిధారతో తన ఆనందాన్ని వెల్లబుచ్చారు .

అధికారులు ఏమన్నారు.

పెద్దపల్లి జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ,నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ / ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి శ్రీనివాస్ అగ్ని ధార ప్రతినిధికి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ప్రధాన కాలువలైన డీ-83 (D83) డీ-86 (D6) కాలువలకు ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు సుమారు 10 రోజుల పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసాము. ఈ నీటి విడుదల వల్ల జిల్లాలో సుమారు ఒక లక్ష 15 వేల వేల ఎకరాల పైగా పంట పొలాల రైతులకు నేరుగా లాభం జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
వరి పంట కీలక దశలో నీళ్లు అందడంతో రైతుల ముఖాలలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు పనిచేస్తామని అగ్నిధారతో తెలిపారు.
పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ ను అగ్నిధార ప్రతినిధి ఇదే విషయమై సంప్రదించగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 15 వేల ఎకరాల వరి సాగు జరిగింది అన్నారు. “వరి పంట చివరి దశలో ఉంది జిల్లాలో పది రోజులపాటు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అందించిన సాగునీటి వల్ల దాదాపు ఒక లక్ష 15వేల ఎకరాల పొలాలు ఎండిపోకుండా పంట చేతికందే చివరి దశలో ప్రభుత్వం నీరు అందించడం జరిగిందన్నారు. వరి పంట కీలక దశ అయినా పాలు తాగి గింజ గట్టిపడదశలో పది రోజులపాటు నీళ్లు రావడంతో రైతులు పండించిన పంట ఎండిపోకుండా కాపాడగలిగాము అన్నారు. ఇప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారు అన్నారు.

జిల్లాలో 51,246 ఎకరాల పత్తి పరిస్థితి.

జిల్లాలో కేవలం వరి మాత్రమే కాదు, పత్తి కూడా రైతులు విస్తారంగా వేశారని జిల్లా వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 51 వేల 246 ఎకరాల్లో పత్తి పంట వేశారు. అయితే పత్తి పంట పూత, కాయ దశలో అధిక వర్షం కురవడం వల్ల పత్తి రైతులకు ఈసారి పంట అంత లాభసాటిగా లేదని తెలిపారు. అధిక వర్షం వల్ల పత్తి మొక్కలు ఏపుగా పెరగలేదని, పత్తి పూత రాలిపోయిందని అగ్ని ధారతో తెలిపారు. దానికి తోడు ఎల్ నినో ప్రభావంతో తిరిగి వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో పత్తి రైతులు కొంత నష్టపోయారని వివరించారు. అయినా పత్తికి ప్రస్తుతం మార్కెట్లో మంచి రేటు పలుకుతోందని రైతులకు భరోసా ఇచ్చారు.

అగ్నిధార ప్రతినిధి చేగొండ రవికుమార్ యాదవ్ సెల్ నెంబర్ 800 8817828.