దస్తగిరిపల్లె వెంకటేశ్వర మహిళా సంఘం నిధులపై విచారణ

అగ్నిధార కథనానికి స్పందన 24 గంటల్లోనే విచారణ

పెద్దపల్లి, సెప్టెంబర్ 25 (అగ్నిధార న్యూస్)

గురువారం అగ్నిధార పత్రికలో ప్రచురితమైన `మహిళా సంఘం డబ్బులు మాయం.. తిన్నది ఎవరు..? తిరిగి చెల్లించేది ఎవరు..?` అనే కథనానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సత్వరం స్పందించారు.

వార్త చూసి వెంటనే స్పందించిన అధికారులు.

అదే రోజు వార్తను చూసిన వెంటనే పెద్దపల్లి జిల్లా అడిషనల్ డీఆర్డీఓ రవీందర్, పెద్దపల్లి ఏపీఎం శైలజా శాంతి పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ పరిధిలోని దస్తగిరిపల్లె గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మహిళా సంఘ సభ్యులు, సి ఎస్ పి, వీఓఏ సంఘ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పత్రికలో వచ్చిన నగదు చెల్లింపుల వివాదంపై ఆరా తీశారు. వీఓఏ, సి ఎస్ పి ల మధ్య నెలకొన్న లెక్కల తేడాను అడిగి తెలుసుకున్నారు. డబ్బులు ఎవరి వద్ద ఉన్నాయి అనే అంశంపై ఆరా తీశారు. ఎవరి వద్ద డబ్బులు ఉన్నా రెండు రోజుల్లో తిరిగి సంఘానికి చెల్లించాలని ఆదేశించారు.

 

శుక్రవారం మరోమారు విచారణ

ఇందులో భాగంగా శుక్రవారం సీసీ జ్యోతి గ్రామానికి చేరుకుని వీఓ లతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. లావాదేవీలు పారదర్శకంగా ఉండాలని, సంఘ సభ్యులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. వెంకటేశ్వర గ్రూపులో సి ఎస్ పి వివో ఏ ఇద్దరి మధ్య నెలకొన్న డబ్బులు వివాదం పైన గ్రామంలోని వివో సంఘంలో చర్చించామన్నారు.
త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. అగ్నిధారలో కథనం రావడంతోనే అధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టడం పట్ల గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.