అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశయానికి తూట్లు –
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆరు నెలల పైగా మూతపడ్డ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్.
పెద్దపల్లి టౌన్, సెప్టెంబర్ 26 (అగ్నిధార న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల లక్ష్యానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే తూట్లు పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సత్సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు200 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
కానీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. పెద్దపల్లి మండలం పాత ఎంపీడీవో ప్రాంగణంలో, వేలాది రూపాయల ( అద్దె )విలువ చేసే ప్రభుత్వ సెటర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సంఘ సభ్యురాలికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ కేటాయించిన కొద్ది నెలలకే క్యాంటీన్ మూతపడింది. దాదాపు ఆరు నెలలకు పైగా షట్టర్ ఎత్తకుండా నేటికీ తాళం వేసి ఉంది. నిత్యం సెర్ప్ శాఖ మండల స్థాయి అధికారులు, అదే దారిలో వస్తూ వెళ్తున్నా, కళ్ళ ముందు కనిపిస్తున్న మూతపడ్డ క్యాంటీన్ ను పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేలాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని నిరుపయోగంగా ఉంచి, ఉత్సాహవంతులైన నిరుపేద మహిళలకు అవకాశం ఇవ్వకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెర్ప్ అధికారుల తీరుపై మహిళా సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఆ శాఖ అధికారులు కళ్ళు తెరిచి, నిర్వహణలో విఫలమైన నిర్వాహకులను పక్కకు తప్పించి, ఉత్సాహవంతులైన నిరుపేద మహిళా గ్రామైక్య సంఘ సభ్యులకు క్యాంటీన్ ను కేటాయించి, పున:ప్రారంభించాలని మహిళా సంఘ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మరి ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

నిరుపయోగంగా మారిన మహిళా శక్తి క్యాంటీన్.
