అగ్నిధార న్యూస్,పాపన్నపేట:
తిరిగి వస్తారానుకున్న వాళ్ళు శవాలుగా మారారు.స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లి ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.ఈసంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని గడి పెద్దాపురం గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.వివరాల లోకి వెళితే..పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన చిలుంగారి సుభాష్ కు అందోల్ మండలం నాదులాపూర్ కు చెందిన అమ్మాయితో పెళ్లి ఖాయమైంది.ఈక్రమంలో సోమవారం నిశ్చితార్థం నిర్ణయించారు.నిశ్చితార్థం ముగించుకొని తిరిగి వస్తుండగా ఓకారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది.దీంతో గడ్డం ప్రభాకర్(27).గడ్డం భీమయ్య(30).శ్రీకాంత్(22) అక్కడికక్కడే మృతి చెందారు.మరొక వ్యక్తి మాసయ్యకు గాయాలయ్యాయి.ఈహఠాత్ పరిణామంతో బాచారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గ్రామం శోకసంద్రంలో మునిగింది.గడ్డం ప్రభాకర్ అంత్యక్రియలు సీతానగరంలో జరిగాయి.అతి పిన్న వయసులోనే మృతి చెందడంతో నూరేళ్లు నిండాయా అని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఈసందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి,భారాస మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,నాయకులు సొంగ దుర్గయ్య మంగళవారం సాయంత్రం మృతుల కుటుంబాలను పరామర్శించారు.ఆర్థిక సాయం అందజేశారు.మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,పాపన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్,నాయకులు ప్రశాంత్ రెడ్డి,కో ఆప్షన్ గౌస్,పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ మృతుల కుటుంబాలను పరామర్శించారు.మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.గ్రామస్తులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


