ఖాకిలకు లాఠీలు బరువా..?
ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపే మొగ్గుచూపుతున్నారు..!
డిజిపి ఆదేశాలకే దిక్కులేదా?
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి జిల్లా ) తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఒకప్పుడు సింహంలా గర్జించిన పోలీస్ లు.. రాను రాను పిల్లిలా మారుతున్నారా..? పుష్కర పుష్కర కాలానికి ముందు ఖాకీ యూనిఫాం, చేతిలో లాఠీ కనిపిస్తే చాలు నడిరోడ్డుపై అల్లరిమూకలు, దొంగలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. కానీ నేడు సీన్ మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ముసుగులో ఖాకీలు తమ అసలైన ఆయుధానికి ( లాటికి సంకెళ్లు వేశారు ) పక్కన పెట్టేశారు. స్వయంగా రాష్ట్ర పోలీస్ బాస్ ( డిజిపి) “పోలీసులు విధిగా లాఠీ ధరించాలి” అని ఆర్డర్ వేసినా.. క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. లాఠీ లేని ఖాకీని చూసి జనం భయపడటం మానేశారు…! అసలు పోలీసులకు లాఠీ మోయడం బరువైందా..? లేక ఫ్రెండ్లీ పోలీస్ విధానం పోలీసుల చేతులకు సంకెళ్లు వేసిందా….?
డిజిపి ఆదేశాలు భేఖాతర్.. ఖాకీల నిర్లక్ష్యం!
శాంతిభద్రతల పరిరక్షణలో లాఠీ అనేది కేవలం ఒక కర్ర కాదు, అదొక పవర్ సింబల్. నడిరోడ్డుపై గొడవలు జరిగినా రాజకీయ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేసిన, ట్రాఫిక్ జామ్ అయినా, ఆకతాయిలు రెచ్చిపోయినా లాఠీ ఝుళిపిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. అందుకే సిబ్బంది అంతా లాఠీలతోనే డ్యూటీ చేయాలని డిజిపి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. పెద్దపల్లి కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి బయటకు వచ్చే కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ ఐ ఉన్నతాధికారు వరకు సిబ్బంది చేతుల్లో లాఠీల ఊసే లేదు. ఉన్నతాధికారుల ఆర్డర్లను కిందిస్థాయి సిబ్బంది లైట్ తీసుకోవడం ఇప్పుడు, ప్రజల్లో పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పెద్దపల్లి పోలీస్ కమిషనర్ తమ సిబ్బందికి విధిగా లాఠీ పట్టాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫ్రెండ్లీ పోలీసింగ్ తో.. పెరిగిన బరితెగింపు!
జనానికి దగ్గరవ్వాలి, ఫ్రెండ్లీగా ఉండాలి అనే గత ప్రస్తుత ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే. కానీ అది కాస్తా ఇప్పుడు పోలీసుల ఆత్మరక్షణకే ముప్పుగా మారుతోంది. పోలీసులంటే భయం పోయింది. చేతిలో లాఠీ లేని పోలీసును చూసి దొంగలు, గంజాయి మూకలు, పేకాట రాయుళ్లు, సంఘవిద్రోహులు, రౌడీ షీటర్లు, జులాయిలు, హేళనగా చూస్తున్నారు.
పోలీసులపైనే దాడులు:
ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిని మందలించడానికి వెళ్లిన పోలీసులపైనే ఎదురుదాడులు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.
కంట్రోల్ తప్పిన జనం:
గొడవలు జరిగినప్పుడు రాజకీయ పార్టీల ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పుడు, నచ్చజెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే, జనం ఫ్రెండ్లీ పోలీసులను లెక్క చేయడం లేదు. పోలీసుల చేతిలో లాఠీ ఉంటే వచ్చే ఆ ‘భయం, భక్తి’ ఫ్రెండ్లీ పోలీస్ మాటలతో రావడం లేదనేది పచ్చి నిజం.
‘ఫ్రెండ్లీ’ పోలీస్ ముసుగులో లాఠీలకు సంకెళ్లు…సోషల్ మీడియా ట్రోలింగ్
కిందిస్థాయి సిబ్బంది కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపే మొగ్గు చూపడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.
పొరపాటున లాఠీ తీస్తే చాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతారని భయం. కేసుల భయం మానవ హక్కుల కమిషన్లు, కోర్టుల చుట్టూ తిరగడం మాకెందుకనే ఉద్దేశంతో పోలీసులు నిరాయుధులుగా మిగిలిపోతున్నారు.
చేతులు కట్టేసిన విధానం:
నిస్సాహాస్థితిలో ఈ ఫ్రెండ్లీ విధానం పోలీసుల చేతిలోని లాఠీలకు సంకెళ్లు వేసింది. పోలీస్ వ్యవస్థ పవర్ కోల్పోయేలా చేస్తోంది. ఏది ఏమైనా ఖాకీ పవర్ కోల్పోకూడదు..! ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులకు న్యాయం చేయడంలో చూపించాలి. చట్టాన్ని తమ పలుకుబడితో చేతుల్లోకి తీసుకునే, దొంగలు, క్రిమినల్స్, సంఘవిద్రోహుల ముందు కాదు… క్రమశిక్షణను కాపాడటంలో పోలీస్ చేతిలో లాఠీ పాత్ర అమూల్యమైనది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాలను గౌరవించి, ప్రతి పోలీస్ చేతిలో మళ్లీ లాఠీ ఉంటేనే సమాజంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. పోలీసులకు గౌరవం ఉంటుంది. ఖాకీలు తమ పవర్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..! లేదు ఫ్రెండ్లీ పోలీసు మాకు ఇష్టం ఇలాగే కొనసాగుతాం అంటే…? రాబోయే రోజుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా మారుడు కాయమనేది సర్వత్ర వినిపిస్తున్న నగ్నసత్యం.
