జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూలై – 23 ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వహించే సమయంలో ఆటంకాలు కల్పించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గంట రమేష్ ప్రభుత్వ అధికారిని విధుల నిర్వహణలో అడ్డుకోవడం, అసభ్యకర, అనుచిత పదజాలంతో దూషించడం, బెదిరింపులకు పాల్పడినట్లు సహాయ కార్యనిర్వహణ ఇంజనీర్, ఎం.బి. ఇంట్రా, పెద్దపల్లి అందజేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 37(1)(ii), 37(1)(iii) ప్రకారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించగా, అందులో పేర్కొన్న ఆరోపణలు సంబంధిత చట్టంలోని నిబంధనల పరిధిలోకి వస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, సంబంధిత సర్పంచ్‌కు కారణం చెప్పాలని కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.షోకాజ్ నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజులలోపు లిఖితపూర్వక సంజాయిషీని సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగా సంజాయిషీ సమర్పించనట్లయితే, అందుబాటులో ఉన్న రికార్డులు, సాక్ష్యాధారాల ఆధారంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన విధులను నిర్వర్తిస్తారని, వారి విధుల నిర్వహణకు ఆటంకం కల్పించడం, బెదిరించడం లేదా అనుచితంగా ప్రవర్తించడం చట్టరీత్యా తీవ్రమైన విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవం, సమన్వయంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
