రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్
మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే
డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ సాంకేతికతతో పారదర్శక సర్వే.
60 రోజులకు మించి భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు.
రీ సర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి.
భూముల రీ సర్వే, నక్ష భూములపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూ శాఖ కార్యదర్శి.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూలై-09:
భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
భూముల రీ సర్వే,నక్ష భూముల అంశాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేతో ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు.
డీజీపీఎస్ ,రోవర్స్, జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు.
రీసర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ఆయా గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేయాలని సూచించారు.
రీ సర్వేలో రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా సమగ్ర శిక్షణ నిర్వహించి అనంతరం అన్ని గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు.
జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రీ సర్వే పూర్తయ్యే వరకు రెగ్యులర్ సర్వేయర్లలో 25 శాతం మందిని రొటేషన్ పద్ధతిలో విధుల్లో వినియోగించాలని తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పనితీరును శాఖ సర్వేయర్లు నిరంతరం పర్యవేక్షించాలని, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.
ప్రతి గ్రామంలో రీ సర్వే నాణ్యతతో నిర్వహించాలని, సర్వేలో ఉపయోగించే ఆధునిక పరికరాల వినియోగాన్ని సాంకేతికంగా పర్యవేక్షించే వ్యవస్థ అందుబాటులో ఉందని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. రీ సర్వేలో పాల్గొనే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుందని తెలిపారు.
భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో అసాధారణ జాప్యం పై ఉన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, సాధారణ విధులు నిర్వహించడానికి కోర్టు ఆదేశాలు అవసరమా అని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు.
ప్రస్తుతం ప్రతి అధికారి వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై హైకోర్టు వివరణ కోరుతోందని, స్పందించేందుకు నాలుగు వారాల గడువు లభించిందన్నారు.
రెవెన్యూ కార్యాలయంలోనూ భూ భారతి దరఖాస్తులు 60 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదని, పెండింగ్ దరఖాస్తులను అత్యంత త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
*జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో రెండు కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాలకు పరిపాలనా అనుమతులు లభించాయని, ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ డిఆర్ఓ రాజేశ్వరి కలెక్టరేట్ ఏవో బి ప్రకాష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ సోమేశ్వర్ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
