మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు..

పేద బిడ్డల ఆత్మగౌరవంపై దాడి

​ఆకలి కేకలు తెలియని వాళ్ళు ఆదర్శాలు చెబుతారా?

​సమతా సైనిక దళ్‌ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ మార్షల్ దుర్గం నగేష్‌ ఆగ్రహం

అగ్నిధార న్యూస్,(పెద్దపల్లి):
ప్రభుత్వ బడుల్లో చదువుకునే నిరుపేద బిడ్డల ఆకలి తీర్చే ‘మధ్యాహ్న భోజనం’ పథకంపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేద విద్యార్థులు బడికి వచ్చేది కేవలం అన్నం కోసమేనని, ఇది వారిని సోమరులుగా మారుస్తుందన్న అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలను సమతా సైనిక దళ్‌ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ మార్షల్ దుర్గం నగేష్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గరికపాటి తీరుపై నిప్పులు చెరిగారు.

​అక్షర అహంకారమా? ఆకలిపై వెటకారమా?: ​”ప్రవచనాల వేదికల మీద కూర్చుని నీతులు చెప్పే గరికపాటికి క్షేత్రస్థాయిలో పేదరికం అంటే ఏంటో తెలుసా?” అని డాక్టర్‌ నగేష్‌ ప్రశ్నించారు. వేలాది మంది పేద, దళిత, గిరిజన బిడ్డలు ఒక పూట తిండి కోసం పడే తపనను అవమానించడం అంటే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం అనేది కేవలం ‘అన్నం పెట్టే’ కార్యక్రమం కాదని, అది విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కల్పిస్తున్న ఒక గొప్ప ‘సామాజిక భరోసా’ అని ఆయన స్పష్టం చేశారు.

​అక్షరాస్యత పెంచిన అన్నం:​మధ్యాహ్న భోజనం అమలులోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, బడి మానేసే వారి సంఖ్య తగ్గిందని నగేష్‌ గుర్తు చేశారు. గరికపాటి వంటి వారు తమ ఆధ్యాత్మికతను కుల, వర్గ అహంకారంతో ముడిపెట్టి మాట్లాడటం సమాజానికి చేటు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

​భోజనం.. పేదవాడి హక్కు:
​రాజ్యాంగం కల్పించిన ‘రైట్ టు ఫుడ్’ (ఆహార హక్కు) కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వం బాధ్యత. దీన్ని ‘ఉచితం’ అని ముద్ర వేసి, పేదలను కించపరచడం రాజ్యాంగ విరుద్ధమని సామాజిక కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.

క్షమాపణ చెప్పాల్సిందే!:”గరికపాటి గారు.. మీ ప్రవచనాల్లో మానవత్వం ఉంటే వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోండి. పేద బిడ్డల పొట్ట కొట్టేలా మాట్లాడటం ధర్మం అనిపించుకోదు. మీ వ్యాఖ్యలు సమాజాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయి. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.” అని డాక్టర్‌ మార్షల్ దుర్గం నగేష్‌, హెచ్చరించారు