అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు
*ఈ నెల 17 నుండి ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణ*
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు మొదలవుతాయని
ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈనెల 17 నుండి గ్రామ గ్రామాన తిరిగి రెండవ విడత ప్రజా పాలన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇట్టి కార్యక్రమంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులను అందివ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క పేద వారికి కూడా ఇల్లు నిర్మించిన పాపాన పోలేదని విమర్శించారు. కేవలం మాటలతోనే గారెడి చేశాడని, ప్రజలకు మాత్రం ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా అన్యాయం చేశాడని అన్నారు. అప్పుడు పేదల పక్షాన తాను పోరాడిన ఫలితంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన అందరికీ మంజూరు చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అవినీతి జరిగినా సహించేది లేదని విజయ రమణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, కౌన్సిలర్లు, పలువురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
హాస్పటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ల నమోదు ప్రక్రియను పలు వార్డులను ఆయన పరిశీలించారు. ఓ పీ వైద్య పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. అలాగే వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేషంట్ ను పలకరించి వారి ఆరోగ్య స్థితిగతులను , బాగోగులను అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ రమాదేవి నుండి వివరాలు అడిగారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..అనేక గ్రామాలకు మండలాలకు కూడలి అయిన సుల్తానాబాద్ హాస్పటల్ లో వైద్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హాస్పిటల్ లోన ఉన్న మాదిరిగా పరిశుభ్రత పరిసరాల్లోనూ ఉంచాలని డాక్టర్లకు సూచించారు. రాబోయే రోజుల్లో హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హాస్పటల్లో జనరేటర్, ఈసీజీ ఇతరత్రా వైద్య సదుపాయాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తానని స్పష్టం చేశారు. హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ రమాదేవి, పలువురు డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


