అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి, పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వెంకటస్వామి 95 వ జయంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో శనివారం రోజున కాకా విగ్రహానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి. వెంకటస్వామి కృషి ఎంతో ఉందని అన్నారు.తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో వెంకటస్వామి ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలక పాత్ర పోషించారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వాన్ని ఒప్పించడంలో తనదైన శైలిలో కృషి జరిపారని చెప్పారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని సైతం ఎదిరించి తెలంగాణ కోసం ఆరాటపడిన వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వెంకటస్వామి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఎమ్మెల్యే అన్నారు. బడుగు వర్గాలను బాగు చేయాలన్న వెంకటస్వామి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం కాక జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కాక వెంకటస్వామి అభిమానులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.