అధికారుల నిర్లక్ష్యం.. నిర్వాహకుల అలసత్వం.

ప్రభుత్వ ఆశయానికి దూరంగా సుల్తానాబాద్ సెర్ప్ అధికారులు.

క్యాంటీన్ ఎంపీక సమిష్టిగా జరగాలి.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి//సుల్తానాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2024 మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా 200 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . ప్రతి జిల్లాకు ఐదు క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ, మహిళ శక్తి కార్యక్రమాలు ద్వారా మహిళల ఆర్థిక స్వాలంబనకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా, సమాజంలో మహిళా శక్తిని ముందుకు తీసుకువెళ్లడం ముఖ్య ఉద్దేశంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రివర్గం కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. మహిళలను కోటీశ్వరులను చేయాలని సత్సంకల్పంతో, అనేక సంక్షేమ పథకాలలో భాగంగా మహిళాశక్తి క్యాంటీన్లు, గ్రామీణ, , ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తాయని, ఇది గ్రామీణ మహిళల ఆర్థిక వ్యవస్థకు పునాది వంటిదని, క్యాంటీన్ ఏర్పాటు ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ, స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆశయం ఇంతవరకు బాగానే ఉంది కానీ, పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యమా..! నిర్వహకుల, అలసత్వమా..!? తెలియదు కానీ ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడుతుంది. సుల్తానాబాద్ మండల పరిషత్ ప్రాంగణంలో ( వేలాది రూపాయల విలువ చేసే కిరాయి)  తేదీ20.10.2024 తొగర్రాయి గ్రామానికి చెందిన ప్రగతి గ్రామైక్య సంఘానికి అధికారులు క్యాంటీన్ కేటాయించారు. నిర్వహణ బాధ్యతలు అనిత వివో అధ్యక్షురాలుకు అప్పగించారు. సంవత్సరం గడవకముందే ప్రభుత్వ ఆశయానికి గండి పడింది. గత మూడు నెలలుగా ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ మూతపడింది. క్యాంటీన్ల ఎంపిక సమయంలో సంఘ సభ్యులు సమిష్టిగా పని చేసుకునే వారికి కేటాయిస్తే బాగుండేది. ఒకరికే కేటాయించడం వల్ల ఈ సమస్య వచ్చిందని అనుకుంటున్నారు. ప్రభుత్వం సదాశయంతో సుల్తానాబాద్ మండల హెడ్ క్వార్టర్ లో నెలకొల్పబడ్డ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ద్వారా ఎంతమంది సభ్యులకి జీవనోపాధి కల్పించారో అధికారులే చెప్పాలి. ఇన్ని నెలలుగా మూతపడ్డ క్యాంటీన్ పు:న ప్రారంభించడానికి అధికారులు ఎందుకు చొరవ చూపెట్టడం లేదు. నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నిర్వాహకులపై వెంటనే చర్యలు చేపట్టి మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సెర్ప్ అధికారులు నెలల తరబడి మూతపడ్డ క్యాంటీన్ చూసుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉన్నారో వారికే తెలియాలి.
ఇదే విషయమై ఏపీఎం కనకయ్యను అగ్నిధార వివరణ కోరగా,క్యాంటీన్ అప్పుడప్పుడు తీస్తున్నారు. గత 15 రోజులుగా తీయడం లేదని సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా ఉత్సాహవంతులైన గ్రామైక్య సంఘానికి క్యాంటీన్ కేటాయించి, పు:న ప్రారంభానికి సంబంధిత మండల, జిల్లా అధికారులు చర్యలు చేపట్టి, ప్రభుత్వ ఆశయాన్ని కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.