వినాయక నిమజ్జనం చెరువు ప్రాంతాన్ని సందర్శించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ .
అగ్నిధారన్యూస్ ( రామగుండం కమిషనరేట్ )
చెన్నూర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే చెన్నూర్ చెరువు ఘాట్‌ను మంచిర్యాల జోన్ డీసీపీ ఎ.భాస్కర్, సందర్శించారు. వినాయక విగ్రహాలు వచ్చే మార్గం, బయటకు వెళ్లే మార్గం,పరిసర ప్రాంతాలు,క్రేన్లను ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ…. చెన్నూర్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి వి. వెంకటస్వామి చేతుల మీదుగా నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లైటింగ్‌తో పాటు రెండు భారీ క్రేన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినాయక విగ్రహాలను నిర్వాహకులు ముందుగానే వాహనాలపై సురక్షితంగా ఏర్పాటు చేసుకుని తీసుకురావాలని సూచించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, శోభాయమానంగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది సుమారు 2,800 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం కోసం మంచిర్యాల, చెన్నూర్,లక్షెట్టిపేట, బెల్లంపల్లి తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు గోదావరి వ్యూ పాయింట్, ఇందారం,వివిధ చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మందమర్రి, తాండూర్ తదితర ప్రాంతాల్లోనూ జిల్లా యంత్రాంగం,రక్షక దళాల సహకారంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా చిన్నపిల్లలు,మద్యం సేవించిన వ్యక్తులు నీటిలోకి దిగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని డీసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ ఉన్నారు.

