అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆవేదన

అగ్నిధారన్యూస్,మహమ్మదాబాద్/గండీడ్: చిరుత దాడిలో రెండు ఆవులు మృతి చెందిన ఘటన గండీడ్ మండలం పెద్ద వార్వాల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివ్వని బాలయ్య తన ఆవులను ఎప్పటిలాగే పొలం వద్ద కట్టేసి సాయంత్రం ఇంటికి వచ్చారు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో పశువులు పెద్దగా అరుస్తుండటాన్ని గమనించిన సాలార్‌నగర్ గ్రామస్తులు బాలయ్యకు సమాచారం అందించారు. దీంతో బాలయ్యతో పాటు పలువురు రైతులు పశువులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో అక్కడికి చేరుకోగా రెండు ఆవులు అప్పటికే మృతి చెంది కనిపించాయి. పశువులపై చిరుత దాడి చేయడంతోనే అవి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. గండీడ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతల సంచారం, పశువులపై దాడులు తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుతల దాడులకు సంబంధించి సుమారు 10 నుంచి 15 పశువులు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. మనుషుల ప్రాణాలు పోతేనే అధికారులు స్పందిస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పొలాల వద్ద పశువులను కట్టివేయాలంటే రైతులు భయాందోళనకు గురవుతున్నారు.చిరుత దాడిలో మృతి చెందిన రెండు ఆవుల విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని బాధితుడు బాలయ్య తెలిపారు. పశువులే తమ కుటుంబానికి జీవనాధారమని, ఆవులు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పశువులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.