అగ్నిధారన్యూస్,( రామగుండం):  గోదావరిఖని బస్సు స్టాండ్‌ అవుట్‌గేట్‌ వద్ద 1.050 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గోదావరిఖని-1 టౌన్‌ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నిందితులు పిన్నోజి గోపి(24), మాచర్ల పవన్‌కుమార్‌(19)గా గుర్తించారు. వారి బ్యాగును తనిఖీ చేయగా 1.050 కిలోల ఎండిన గంజాయి లభించింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. చంద్రపూర్‌ నుంచి రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుంచి ఆటోలో గోదావరిఖనికి వచ్చిన నిందితులు హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.52,500 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తరలింపునకు ఉపయోగించిన బ్యాగు, ఓ మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.