బ్రాహ్మణబందు ప్రకటించాలి..

బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాస్ డిమాండ్.. 

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)సంక్షేమ పథకాలు అమలుపరంగా వివక్షకు లోనవుతున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద బ్రాహ్మణులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పెద్దపల్లికి చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల బ్రాహ్మణ  జనాభా ఉందని,  సగం మంది పేదరికంతో బాదపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరోహితం తప్ప, వేరే పని చేయలేక, అనేక కుటుంబాలు గడవక సతమతం అవుతున్నాయని వాపోయారు. మరోవైపు బ్రాహ్మణుల్లో రాజకీయ చైతన్యం కూడా లేదని, అడపాదడపా ఆయా ప్రభుత్వాలు ఇచ్చే నామినేటెడ్ పదవులు మినహాయిస్తే, చట్ట సభల్లో అవకాశాలు అరుదుగా లభిస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ జాతికి చెందిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదేవిధంగా బ్రాహ్మణబందు ప్రకటించి అర్హత గల ప్రతీ ఒక్కరికి రూ.10లక్షలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఉపాధి హామీ కింద ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఎంపికయిన వారికి నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. బీసీలకు, మైనార్టీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగానే బ్రాహ్మణులకు కూడా రూ.లక్ష ఆర్థిక సహాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.