అధికార పార్టీ అభ్యర్థుల ఎదురు చూపులు.
రాష్ట్రమంతా ఇదే పరిస్థితి.
వడబోత దశలో కాంగ్రెస్,
వేచి చూస్తున్న బీజేపీ.
ఓవైపు అసమ్మతి.. మరో వైపు ఫిరాయింపులు.
గులాబీ లీడర్లను పట్టుకున్న గుబులు.
ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు.
బలమైన అభ్యర్థి ఎదురైతే గెలుపుపై ఆందోళన.
అనుచరుల్లోనూ ఇదే చర్చ.
అయినా గెలుపొందుతామనే ధీమాలో బీఆర్ఎస్ అభ్యర్థులు.
( అగ్నిధార స్పెషల్ రిపోర్ట్. ).
అగ్నిధారన్యూస్, ( పెద్దపల్లి//కరీంనగర్ )
అక్టోబర్ 9న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి దేశంలోని ఐదు రాష్ట్రాలకు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం,లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 21న రాష్ట్రంలోని 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. మొత్తం 119 ఎమ్మెల్యే స్థానాలకు గాను115 మంది ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటించారు. వారిలో ఏడుగురిని వివిధ కారణాలతో కొత్తవారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసింది. ముందు నుండి కెసిఆర్ చెప్పినట్లుగానే గత ఎన్నికలతో పాటు ఈ ఎన్నికల్లోను దాదాపు సిట్టింగులకే టిక్కెట్లు ఇచ్చారు. అభ్యర్థుల మీద ఉన్న ధైర్యం కంటే ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమం పైన ఉన్న ధైర్యంతో అభ్యర్థులను ప్రకటించారు. దీనితో మూడుసార్లు ఒకే వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడంతో సహజంగానే అభ్యర్థులపైన కొంతమేరకు ప్రజల్లో వ్యతిరేకత చాలాచోట్ల పెరిగింది. దీనికి తోడు ఉద్యమ కాలం నుండి పార్టీని అంటూ పెట్టుకుని పార్టీ కోసమే అనుక్షణం పని చేస్తున్నటువంటి ఆశావాహులు సిట్టింగులకు టికెట్లు ఇవ్వొద్దంటూ, టికెట్ ఆశిస్తున్నవారు పలు చోట్ల బీఆర్ఎస్ అసమ్మతి వాదులు అధిష్టానికి ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అభ్యర్థిని మార్చాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో బీ ఆర్ఎస్ పార్టీని మారినవారు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల అభ్యర్థిత్వం ఖరారు కావడంతో తొలి అడుగు పడినట్లు అయింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ ఒకచోట మినహా మిగతా అభ్యర్థులందరూ అదే స్థానాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఐ కమాండ్ సూచనల మేరకు జనంలో ఉండి, వారి మెప్పును పొందాలంటూ ఆదేశాలు , మరోవైపు నేతల హడావిడితో పాటు ఇంటిలిజెన్స్ రిపోర్టులు, అధిష్టానం చేయిస్తున్న సర్వేలతో, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవు తున్నారు. ఇదే సమయంలో తమ ప్రత్యర్థులు ఎవరా..? అని ఆసక్తి ఒకవైపు,ఆందోళనగా మరోవైపు ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థి తమకన్నా ఆర్థిక, ప్రజాబలంలో, బలహీనుడైతే బయటపడొచ్చు.అదే బలవంతుడైతే…? ఎలా ముందుకు వెళ్లాలి.. అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో గతంలో చేసిన అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాప్రయోజన పథకాలతోపాటు, కెసిఆర్ పై ప్రజల్లో ఉన్న ఆధర అభిమానులను నమ్ముకొని అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ అక్కడక్కడ అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకతతో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ మరో సారీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నప్పటికీ, లోలోపల ఆందోళన తప్పడం లేదు. అందుకే ఇప్పుడు గులాబీ పార్టీ అభ్యర్థుల చూపుంత కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా పైనే ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థుల పైన, బీఆర్‌ఎస్ సిట్టింగులు, సీటు దక్కించుకున్న వారి భవితవ్యం ఆధారపడి ఉందంటూ ఆ పార్టీకి చెందిన నేతలే అభిప్రాయపడుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థుల ఆధారంగా తమ గెలుపోటములు ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు,ఇంటిలిజెన్స్ సర్వేల, గులాబీ పార్టీ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పలు చోట్ల అధికార పార్టీతో నువ్వా-నేనా అనే రీతిలో ఫైట్ చేయబోతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, మంథని సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిపత్యం చూపే అవకాశం ఉంది.ఇక్కడ మిగతా ఆశావహులు ఇప్పటికే సైలెంట్ అయిపోయారు..?. పెద్దపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్నారు. ప్రస్తుత సమీకరణాలను చూస్తుంటే దాదాపు విజయరమణారావు వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే గుజ్జుల కరీంనగర్ లో బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. రామగుండంలో మక్కాన్ సింగ్, జనక్ ప్రసాద్ ?లలో ఎవరు అభ్యర్థి అనేది ఇంకా తేలలేదు. ఇక్కడి నుండి దాదాపు మక్కాన్సింగ్ కే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ప్రజల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం జరుగుతుంది.బీజేపీ నుంచి మొన్నటి వరకు కౌశిక హరి బరిలో నిలుస్తాడని చర్చ జరిగింది. అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా సోమారపు సత్యనారాయణ బిజెపికి రాజీనామా చేశారు. ఆయన ఇండిపెండెంట్ గా బరిలో దిగుతాడనేది చర్చ.బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు. వేములవాడలో ఆది శ్రీనివాస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. అయితే ఇక్కడ బీజేపీ నుంచి మొన్నటి వరకు జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా బరిలో ఉంటారని అందరూ భావించారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్ రావు కమలం తీర్థం పుచ్చుకున్నాడు. వేములవాడ నుంచి బరిలో దిగాలని యోచిస్తున్నట్ల తెలుస్తున్నది. అయితే ఇక్కడ అధికార పార్టీ సిట్టింగును కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావును బరిలోకి దించుతుంది. చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం వివాదం అవుతుండడంతో గులాబీ బాస్ అభ్యర్థిని మార్చక తప్పలేదు. అసమ్మతి వాదం వినిపించిన రమేష్ కి కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. ఇక కోరుట్లలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తాను బరిలోకి దిగకుండా తన కొడుకు పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లు ఎవరిని బరిలోకి దించబోతున్నదనే తెలియడం లేదు. జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి బరిలోకి నిలుస్తున్నాడు. కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి ఈసారి కూడా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ కుదరని పక్షంలో తన కుటుంబ సభ్యులను దించుతాడా,..? ఇతరులకు అవకాశం కల్పిస్తాడా…? అనేది తెలియాల్సి ఉంది. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మన్ కు టికెట్ ఖాయమనే తెలుస్తున్నా వరుస ఓటముల కారణంగా మరో అభ్యర్థిని బరిలోకి దించితే ఎలా ఉంటుందనే కోణంలో కాంగ్రెస్ ఆలోచిస్తుంది. బీజేపీ నుంచి గతంలో కన్నం అంజయ్య బరిలో నిలవగా బండి సంజయ్ పై తిరుగుబాటు చేశాడు. అతనికి టికెట్ వస్తుందో రాదో తెలియడం లేదు. అదే స్థానం నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ధర్మపురి అసెంబ్లీ నుంచి బరిలో నిలవబోతున్నాడంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తున్నది. ఇక సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ కు ఇప్పటికైతే తిరుగులేదు. సిరిసిల్ల నుండి మరోసారి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి పెరిగిన గ్రాఫ్‌కు తోడు వారి అభ్యర్థులూ బలమైన వారైతే… ఆయా సీట్లలో కారు ముందుకు పోవటం కష్టమేననే వాదనలు బలంగా వినబడుతున్నాయి.గులాబీ పార్టీ కంచుకోటలని భావిస్తున్న స్థానాల్లో కూడా గెలుపు అంత సులభం కాకపోవచ్చనే తెలుస్తోంది. ఉదాహరణకు,జగిత్యాల, వేములవాడ, పెద్దపల్లి మానకొండూర్, మంథని రామగుండం,మొదలైన నియోజకవర్గాల్లో కారు పార్టీ గెలుపు అంత ఈజీ కాదు….? ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులకు కాంగ్రెస్ టిక్కెట్లు దక్కే అవకాశాలుండటమే దీనికి కారణం. జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో సైతం హస్తం పార్టీకి సాంప్రదాయక ఓటు బ్యాంకు బలంగా ఉంది. దీనికితోడు బలమైన అభ్యర్థులను బరిలోకి దించితే అది కాంగ్రెస్‌కు మరింతగా కలిసొచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కారు కంచుకోటల్లో సైతం ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురు కావొచ్చన్నది విశ్లేషకుల వాదన. ఈ కారణంతోనే గులాబీ పార్టీ నుంచి తొలి జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ జాబితా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ ఛరిష్మా, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకుతోడు హస్తం పార్టీ తరపున బలహీన అభ్యర్థులు బరిలోకి దిగితే.. తమ గెలుపు సులవవుతుందని వారి ఆశ. బలమైన అభ్యర్థులు ప్రత్యర్థులుగా ఉంటే మాత్రం తమతోపాటు ప్రభుత్వానికి కూడా గండం తప్పదని ఆందోళన చెందుతున్నారు. అందువల్ల అనేక స్థానాల్లో కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థులపైన్నే బీఆర్‌ఎస్ నేతల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
