అర్హులైన ప్రతి ఒక్కరికీ 6 గ్యారెంటీ పథకాలు అమలు –
ప్రతి కుటుంబం దరఖాస్తు సమర్పించేలా పంచాయతీ కార్యదర్శి శ్రద్ధ వహించాలి.
సుల్తానాబాద్ , ఎలిగేడు , కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజా పాలన సభలు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )
పెద్దపల్లి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
శుక్రవారం ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్, సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం, పెద్దపల్లి మండలం మూలసాల, రంగంపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలలో పాల్గొన్నారు.గ్రామ సభలలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ….
గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన సభలో దరఖాస్తులు సమర్పించలేని వారు జనవరి 6 వరకు తమ దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని, గ్రామంలోని ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకునే విధంగా పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆరు గ్యారంటీలను బాధ్యతాయుతంగా అమలు చేయడం జరుగుతుందని, ఇప్పటికే ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి రెండు పధకాలను అమలు చేశామని, మిగతా పథకాలను ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రజా పాలనా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యాసంగి సీజన్ నుంచి రైతులకు ధాన్యం తరుగు జర్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రజా పాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి , రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత ఇందిరమ్మ ఇండ్ల పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, గ్రామంలోని ప్రతి కుటుంబం వారి కుటుంబ పరిధిలో రావాల్సిన పథకాలకు దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించాలని ఎమ్మెల్యే తెలిపారు.
కాట్నపల్లి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను నేరుగా సంప్రదించాలని, కాట్నపల్లి గ్రామ శివారులో తన ఇల్లు ఉందని అన్నారు. కాట్నపల్లి గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానన్నారు.
ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడుతూ…
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు వచ్చి దరఖాస్తులు సమర్పించాలని, గ్రామ అధికారుల ద్వారా దరఖాస్తు ఫారంలు ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నామని, దరఖాస్తుదారుడు ముందస్తుగానే తమ దరఖాస్తు నింపి సభ వద్దకు రావాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని , కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అన్ని పథకాలకు సంబంధించి కుటుంబం యూనిట్ గా ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ద ఈడి మధుసూదన్ శర్మ, పెద్దపల్లి ఎంపీడీవో రాజు,ఎంఈఓ సురేందర్ కుమార్, ఎంపీఓ సుదర్శన్, ప్రత్యేక అధికారులు, జడ్పిటిసి స్వరూప, భూత గడ్డ సంపత్ మూలసాల సర్పంచ్ శంకరయ్య, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్,వెంకటేష్, రంగంపల్లి మాజీ సర్పంచ్ పూదరి మహేందర్ రాజు కాట్నపల్లి గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


