ఎమ్మెల్యేకు సహకరించని పాత క్యాడర్
మాజీ మంత్రి చిన్నారెడ్డి ఒంటెద్దు పోకడతో అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు
అగ్నిధారన్యూస్, వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో పాత,కొత్త నేతల మధ్య సయోధ్య కుదరక మూడు ముక్కల ఆట కొనసాగుతోంది.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యే గా ఉన్న మేఘా రెడ్డి తో మాజీ మంత్రి చిన్నారెడ్డి కి సఖ్యత కుదరడం లేదు.మరోవైపు మొదటి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిని విభేదిస్తూ వచ్చిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి,మెగా రెడ్డి మధ్య సఖ్యత కుదిరిన, మాజీ మంత్రితో మాత్రం వారికి సఖ్యత కుదరలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మేఘా రెడ్డి తరపున మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రచారం చేయకపోయినా మేఘా రెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీని సాధించగలిగాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మధ్య సఖ్యత కుదురుతుందని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఫలితాలు వెలువడి ఎమ్మెల్యేగా మేఘా రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేతలు ముగ్గురు కలిసి మాట్లాడిన సందర్భాలు తక్కువే.
ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి పార్టీ కోసం, తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మాజీ మంత్రి చిన్నారెడ్డి శుక్రవారం బీజేపీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లను హైదరాబాద్ తీసుకువెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం వనపర్తి కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఎమ్మెల్యే మేఘా రెడ్డికి విషయం తెలియజేసి పార్టీలో చేర్పించారా? లేక మాజీ మంత్రి సొంత నిర్ణయమా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్,స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరకపోవడం ఆ పార్టీ శ్రేణులలో కలవరం కలిగిస్తోంది.




