అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ గత సంవత్సరం దసరా రోజున కురిసిన భారీ వర్షాలతో పాటు పిడుగులతో సుల్తానాబాద్ లోని ఆధార్ కేంద్రం లో షార్ట్ సర్క్యూట్తో ధ్వంసం అయ్యాయి. దీంతో మండల కేంద్రంలోని ప్రజలు ఆధార్ కార్డులో మార్పు చేర్పుల కోసం జిల్లా కేంద్రమైన పెద్దపల్లి కి వెళుతూ ఉండడంతో అక్కడ కూడా టోకెన్స్ జారీ చేస్తూ ఉండడంతో రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని మరికొందరికి టోకెన్లు దొరకకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల ప్రజా పాలన కార్యక్రమంలో చంటి పిల్లలకు, కొత్తగా పెళ్లయిన వారికి ఆధార్ కార్డులో పేర్లు నమోదు చేయకపోవడంతో కొన్ని పథకాలకు మేము అర్హులము ఐతామో కామోనని నిరాశ చెందుతున్నారు.ఇదిలా ఉంటే గత రెండు నెలల నుండి రేషన్ కార్డులో కేవైసీ ప్రక్రియ ప్రారంభించడంతో పలువురు లబ్ధిదారుల వివరాలు ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోకపోవడంతో అలాగే ఈనెల జనవరి 31 తో కేవైసీ ముగిస్తూ ఉండడంతో లబ్ధిదారులు అసౌకర్యానికి గురవుతున్నారు . గత మూడు నెలల కిందట పలు రాజకీయ పార్టీల నాయకులు సుల్తానాబాద్ లో ఆధార్ సెంటర్ కోసం ఆందోళనలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఆధార్ సెంటర్ను కేటాయించకపోవడంతో పాటు ఆందోళన చేసిన నాయకుల హామీలు ఏమైనట్టని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై మండల తహసీల్దార్ మధుసూదన్ రెడ్డిని సంప్రదించగా ఆధార్ కేంద్రం గురించి ఉన్నతాధికారులకు తెలిపామని మరో పది రోజుల్లో పాత కార్యాలయంలోని ఆధార్ సేవలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
