మార్కెట్ డిమాండ్ అనుగుణంగా మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
టాస్క్ సెంటర్ ను యువత వినియోగించుకొని తమ నైపుణ్యాలను పెంచుకోవాలి.
యువత లక్ష్యాల సాధనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా మార్చి 16:
విద్యార్థుల కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మార్కెట్ డిమాండ్ ప్రకారం ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి పట్టణంలోనీ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న జిల్లా సమాఖ్య భవనంలో, నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్, ( తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ Telangana academy for skill and knowledge ) నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం విద్యార్థులకు విద్యార్హతలతో పాటు ఇతర నైపుణ్యాలు ఉంటే ఉపాధి లభిస్తుందని, మార్కెట్ లో వివిధ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు ముందస్తుగా అందించి ఉద్యోగ నిర్వహణకు వారిని సన్నద్ధం చేసేందుకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభించామని, జూన్ మాసంలో కంపెనీలు ఉపాధి డ్రైవ్ చేపడతాయని, అంతకంటే ముందు ఒక బ్యాచ్ కు శిక్షణ అందించి వారిని సన్నద్ధం చేసేందుకు టాస్క్ సెంటర్ త్వరగా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, టాస్క్ సెంటర్ ద్వారా విద్యార్థులకు 110 కు పైగా వివిధ రకాల కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాలను యువత వినియోగించుకొని జీవితంలో ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
మన జీవితంలో ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు మన నైపుణ్యాలను ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేసుకోవాలని, నూతన అంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. యువత నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తామని, వారికి అవసరమైన గైడెన్స్, నైపుణ్య శిక్షణను టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుంద ని, ఉద్యోగం కోసమే కాకుండా చిన్న, చిన్న వ్యాపారాలు ప్రారంభించడం కోసం అవసరమైన గైడెన్స్ సైతం టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు.
పోటీ ప్రపంచంలో మనం నిలదొక్కుకోవా లంటే మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలని, ప్రపంచంలో వస్తున్న మార్పులకు సన్నద్ధం కావాలని, గతంలో కేవలం విద్యార్హతలతో మాత్రమే ఉద్యోగాలు లభించాయని, ప్రస్తుతం విద్యార్హతలతో పాటు తప్పనిసరిగా నైపుణ్యాలు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా అవసరమని అన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో 1500 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 300 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని, 500 మంది ఎంపిక ప్రక్రియలో ఉన్నారని, అవసరమైన శిక్షణను అందించేందుకు టాస్క్ సెంటర్ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
టాస్క్ సెంటర్ వద్ద అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా టాస్క్ సెంటర్ ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని, పెద్దపల్లి జిల్లాలోని యువతకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు సంపూర్ణ సహకారం అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ, పోటీ ప్రపంచంతో సమాంతరంగా పెద్దపల్లి యువత ఎదిగేందుకు విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి అవసరమని, దీనికోసం ప్రత్యేకంగా టాస్క్ సెంటర్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రికి, పెద్దపల్లి ఎమ్మెల్యేకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ ను యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఇక్కడ నైపుణ్యం గల అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని, మార్కెట్ డిమాండ్ అనుగుణంగా అవసరమైన కోర్సులను పూర్తి చేసి ఉపాధి సాధన దిశగా యువత ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ,రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు .
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 టాస్క్ కేంద్రాలు ఉన్నాయని, 750 పైగా విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటివరకు 18,000 మంది ఫ్యాకల్టీ 9 లక్షల పైగా యువతకు టాస్క్ ద్వారా శిక్షణ అందించామని, 110 పైగా కోర్సులకు శిక్షణ అందిస్తామని అన్నారు.
టాస్క్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ అందించడంతోపాటు ప్రత్యేక ఉపాధి డ్రైవ్ లు, వినూత్న ఆలోచనలకు తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మునిసిపల్ కమిషనర్ వెంకటేష్ , జిల్లా మహిళ అధ్యక్షురాలు సరస్వతి, రేఖ, కళ్యాణి, కోమల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్.గంగా ప్రసాద్,, , తదితరులు పాల్గొన్నారు.



