పంచాయతీరాజ్ కమిషనరేట్ కు ఎంపీఓ సరెండర్.
మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు.
చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు.
అక్రమ ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ ను విధుల నుంచి తప్పిస్తూ కమిషనర్ పంచాయతీరాజ్ హైదరాబాద్ కి సరెండర్ చేస్తూ,పెద్దపల్లి కలెక్టర్ సోమవారం రోజు ఎల్ ఆర్ నెంబర్, ఏ1/1129/2024 పి టి ఎస్, తేదీ10.06.2024 ద్వారాఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత నెల 30 తేదీ రోజున మంథని ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ పైన, మండలంలోని 26 మంది పంచాయతీ కార్యదర్శులు, స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ అరుణశ్రీ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంపీఓ, ఆరిఫ్ హుస్సేన్, మండలంలోని పంచాయితీ కార్యదర్శులను మానసికంగా వేధిస్తున్నాడని, మహిళ పంచాయతీ కార్యదర్శులను, వారి భర్తలను కించపరుస్తున్నాడని, తన పైశాచిక ఆనందంతో, వికృత చేష్టలు చేస్తున్నాడని, మహిళా కార్యదర్శిలను దూషిస్తున్నాడని, ద్వందర్థాలతో వ్యంగంగా మాట్లాడుతూ, డబ్బు కోసమే పని చేస్తూ, ఆర్థిక దోపిడీలో తనకు సహకరించని పంచాయితీ కార్యదర్శులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు, పంచాయతీ కార్యదర్శులను తన వ్యక్తిగత డ్రైవర్లుగా ఉపయోగించుకునేవాడని, మహిళా కార్యదర్శిలను అనరాని మాటలతో వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ అరుణ శ్రీ,పెద్దపల్లి జిల్లా పరిషత్ సీఈవో ను విచారణ అధికారిగా నియమించారు. 31.05.2024 రోజున మంథని మండల పరిషత్ కార్యాలయంలో విచారణ అధికారైన జెడ్పి సీఈవో నరేందర్ మంథని మండల పంచాయతీ కార్యదర్శులతో, ఎంపీవోతో… 31.05 2024 ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయం మంథనిలో ప్రతి ఒక్కరితో,వ్యక్తిగతంగా విచారణ నిర్వహించగా, అన్ని పంచాయతీల కార్యదర్శులు ముఖ్యంగా మహిళా కార్యదర్శిలు ఇచ్చిన వాంగ్మూలాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకున్నారు. ఎంపీఓపై వచ్చిన ఆరోపణలు రుజువు కాబడినందున,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…... మంథని ఎంపీఓగా చట్టబద్ధమైన విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని గ్రహించారు. మండల పంచాయతీ అధికారిగా పనిచేయలేని కారణంగా, మహిళ పంచాయతీ కార్యదర్శులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు, డబ్బులు డిమాండ్ చేయడం గమనించినందువల్ల, మంథని ఎంపీఓగా విధులు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయ్యారని గమనించి, పెద్దపల్లి జిల్లాలో ఆయనను మరే మండలంలో కొనసాగించలేక, మంథని ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ ని కమిషనర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ హైదరాబాదుకు సరెండర్ చేస్తూ.. సోమవారం రోజు ఎల్ ఆర్ నెంబర్, ఏ1/1129/2024 పి టి ఎస్, తేదీ10.06.2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
