అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కమిషనరేట్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.పెద్దపల్లి,మంచిర్యాల జోన్లలోని పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఎవరైనా ఆపదలో చిక్కుకున్నట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు. అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ పరిధిలోని డ్యామ్‌లు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని,సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎవరూ అక్కడికి వెళ్లరాదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ప్రజలు పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ సహకరించాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు,కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ల రాదు. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో లేదా పాడైన నిర్మాణాల వద్ద ఆశ్రయం పొందరాదు. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు తాకరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు,నాలాలు, డ్యామ్‌లు, జలపాతాలు (వాటర్‌ ఫాల్స్) వద్దకు వెళ్లరాదు.చేపల వేట కోసం కూడా వెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలి.స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్,ఆర్‌అండ్‌బీ, వైద్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ,వరదల కారణంగా రహదారులు దెబ్బతిన్న లేదా నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా ఇరువైపులా బ్యారికేడ్లు,ప్లాస్టిక్ కోన్‌లు,హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువులు, కుంటలు,అలుగులు, ప్రధానరహదారులపై ప్రవహిస్తున్న వాగులు, వంకల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలీసు అధికారులు,సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద నీటి కారణంగా చెరువులు, కుంటలు నిండి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడం, గుంతలు ఏర్పడి వాటిలో నీరు నిల్వ ఉండడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.కాబట్టి నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.కల్వర్టులు,చిన్న వంతెనలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో వాహనాలతో వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని హెచ్చరించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు, కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని, పోలీసు సిబ్బంది 24 గంటల పాటు సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటారని పోలీస్ కమిషనర్ తెలిపారు.