ఈ కేవైసీకి 10 నుండి 20 రూపాయలు వసూలు చేస్తున్న డీలర్లు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా డీలర్ల చర్యలు.
ఈ కేవైసీ కి గడువు తక్కువని గందరగోళంలో లబ్ధిదారులు.
పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న తంతుపై అధికారులు దృష్టి సారించాలి.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా
ఫుడ్ సెక్యూరిటీ కార్డులో చనిపోయిన వారి పేర్లు తీయకుండా లబ్ధిదారులకు మీవారు చనిపోయారు కాబట్టి, బియ్యం రావటం లేదంటూ చెప్పి ప్రభుత్వం నుండి వస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్ కాజేస్తున్నారనే ఆరోపణలు, అదేవిధంగా కొత్తగా పెళ్లయిన వారికి, గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడం, చిన్నపిల్లల నమోదు కార్యక్రమం లేకపోవడం లాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల రేషన్ కార్డు, ఆధార్ తో ఈ కేవైసీ అనుసంధానం చేయించాలని ఈనెల 21న డీలర్లకి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది రేషన్ డీలర్లు గ్రామాలలో రేషన్ లబ్ధిదారులతో ఈ కేవైసీ చేయిస్తున్నారు. మరి కొంతమంది డీలర్లు, ప్రభుత్వం నుండి కానీ లేదా, లబ్ధిదారు నుండి కానీ డీలర్ కు, ఈ కేవైసీ చేయిస్తే ఇచ్చే కమిషన్ విషయమై ప్రభుత్వ ఆదేశాల కోసం మరికొందరు డీలర్లు వేచి చూస్తే, పెద్దపల్లిజిల్లా కమాన్ పూర్, మంథని, మండలంలోని కొంతమంది డీలర్లు మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ నిబంధనలకు తుంగలో తొక్కి చేతివాటం ప్రదర్శిస్తున్నారు… ఈ కేవైసీ చేయించుకోవడానికి వచ్చే లబ్ధిదారుని నుండి ఒక్కొక్కరి వద్ద 10 నుంచి 20 రూపాయలు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఒక్క రేషన్ కార్డు మీద 5 మంది ఉన్నారంటే 50 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటూ డీలర్ల తీరుపై మండిపడుతున్నారు. డబ్బులు ఎందుకు ఇయ్యాలంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాప్ కాడికి ఈకేవైసీకి లబ్ధిదారుడు వెళితే ఒక రేటు, రేషన్ డీలరే స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళితే మరో రేటు ఫిక్స్ చేసి మరి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చనిపోయిన వ్యక్తుల బియ్యాన్ని డీలర్లు బుక్కుతుండ్రు….
ఒక వ్యక్తి చనిపోగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డు నుండి పేర్లు తీసేస్తారు కానీ పేర్లు తీసివేయకుండా లబ్ధిదారులకు ఇవ్వకుండా రేషన్ బియ్యం కొందరు డీలర్లు కాజేస్తుండ్రు అనే ఆరోపణలు అక్కడక్కడ లబ్ధిదారుల నుండి వినబడుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా,మహమ్మదాబాద్ మండలం గాదిరాల్ గ్రామానికి చెందిన గుముడాల సవరయ్య గత రెండు సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులో మాత్రం పేరు ఉంది, అతని పేరుమీద వస్తున్న బియ్యాన్ని డీలర్ కాజేసి అతని భార్యకు మీఆయన చనిపోయాడు కాబట్టి, బియ్యం రావని చెప్పి, నెలనెల వస్తున్న బియ్యాన్ని మాత్రం కాజేస్తున్నాడనేది, అతని భార్య ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు ఏ ఒక్క ఊరుకో, వాడకో పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో చనిపోయిన వాళ్ళ పేర్లు రేషన్ కార్డు నుండి తొలగించకపోను, వస్తున్న బియ్యాన్ని కాజేస్తున్నట్లు అక్కడక్కడ డీలర్లపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే రేషన్ బియ్యానికి వచ్చే లబ్ధిదారులకు కొందరుడీలర్లు సమయపాలన పాటించకుండా, లబ్ధిదారులకి ఇబ్బందులు కలిగిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కేవైసీ పేరిట డబ్బులు వసూలు చేస్తూ, చనిపోయిన వాళ్ళ బియ్యాన్ని కాజేస్తున్న డీలర్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

