అధికారులు సమర్థవంతంగా పనిచేసి ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించాలి.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
మున్సిపాలిటీలలో అధికారుల సమర్థవంతంగా పనిచేయాలి.
సమ్మక్క సారక్క జాతరకు బస్సులను సమకూర్చాలి.
ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేశాం.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా//మంథని:
ప్రభుత్వ అధికారులు జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రణాళికబద్ధంగా లక్ష్యాలు సాధించి మంచి పేరు సాధించి ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం మంథనిలోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా, డివిజన్ అధికారులతో సమీక్షించారు.
ముందుగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ….
జిల్లాలో అభివృద్ధి లక్ష్యాలు, సాధించిన ప్రగతి వివరాలను వివరించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడం జరిగిందని రెండు లక్షల 40 వేల 225 దరఖాస్తులు వచ్చాయని, 99.68 శాతం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నామని, ఈ రోజు మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకుంటామని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో విజయవంతంగా నడుస్తున్నదని తెలిపారు. తమ ఆదేశాల ప్రకారం జిల్లాలో అభివృద్ధి లక్ష్యాలు సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు…
ప్రభుత్వ శాఖల వారీగా వివరాలను అడిగి తెలుసుకుని శాఖల వారిగా సమీక్షిస్తూ సాధించవలసిన ప్రగతిపై సూచనలు, సలహాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి మాట్లాడుతూ, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో జిల్లాలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలలో అధికారులు అందరూ సహకరించి, సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలని, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నా పని తీరులో రాజీ లేకుండా సమర్థవంతంగా పని చేయడం జరిగిందని, ప్రజలు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే విధానం మారాలని, త్వరలో సిటిజన్ చార్ట్ తీసుకొస్తున్నామని తెలిపారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఆర్టీసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నడుస్తున్నదని, ఆక్యుపెన్సి రేట్ దాదాపు 80 శాతం నుండి 90 శాతం కు పైగా చేరుకున్నదని,మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారని, ఇప్పటివరకు మంథిని డిపో పరిధిలో 2,12,773 మంది మహిళలు, గోదావరిఖని డిపో పరిధిలో 5,67,909 మహిళలు జీరో టికెట్టు తో ప్రయాణం సాగించారని, మంథని పరిధిలో 88 శాతం, గోదావరిఖని డిపో పరిధిలో 90 శాతం అక్యుపెన్సి రేటు చేరిందని తెలిపారు.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎంతమంది ప్రయాణం చేస్తారు, ఎన్ని బస్సులు ఆదనంగా కావాల్సి ఉంటుంది అనే విషయం తెలియజేయాలని, మహాలక్ష్మి పథకం అమలు తీరును అధికారులు తనిఖీ చేసి పరిశీలించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని లోటుపాట్లను సవరించే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ లో 10 లక్షల సదుపాయాన్ని అమలు చేసినప్పటి నుండి జిల్లాలో ఇప్పటివరకు 1081 మంది సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. మంథని, పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించి యంత్రాంగం పని తీరు మారి సమర్థవంతంగా అభివృద్ధి చేసేలా కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేసి సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీలు మోడల్ మున్సిపాలిటీలు గా, కార్పొరేషన్ మోడల్ మునిసిపల్ కార్పొరేషన్ గా మారేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రొటీన్ గా పని చేయకుండా సమర్థవంతమైన విధులను నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పనులను, పెండింగ్లో ఉన్న పనులను ఏ విధంగా పూర్తి చేద్దాం అనే ఆలోచన ఉండాలని, మార్చి లోపల ఎన్ని కంప్లీట్ చేసుకోవచ్చు నివేదిక తయారు చేయాలని, మార్చిలోపల పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, క్యారీ ఓవర్ ఫండ్స్ పనులను పూర్తి చేయాలని అన్నారు. మన ఊరు మన బడిలో ఇప్పటివరకు ఎన్ని పనులు పూర్తి చేసాం, ఇంకా ఎన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఏ ఎ పనులు చేయాల్సి ఉన్నది నివేదిక తయారు చేయాలని, విద్యాపరంగా జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. శాఖా పరంగా చేపట్టే కార్యక్రమాలలో కొన్ని శాఖల్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలని, పనితీరులో మార్పు రావాలని సూచించారు. జిల్లాలోని ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా మార్పు తీసుకొని రావాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్ తో సమీక్షిస్తానని శాఖల వారీగా ఇంప్రూవ్మెంట్ కనబడాలని సూచించారు. ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం సమర్థవంతంగా పని చేయాలని, అన్ని విభాగాలలో మార్పు కనబడాలి అని, జిల్లాలో గతంలో అల్లకల్లోలం సృష్టించారని, ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా పోలీసులు సహకరించాలని సి.పి. రెమా రాజేశ్వరికి తెలిపారు.
ఖరీఫ్ 2023-24 వరి ధాన్యం సేకరణ కొరకు జిల్లాలో 307 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు ఒక లక్షా 88 వేల 918 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, దీని విలువ 415.77 కోట్లు కాగా, 88 శాతం డబ్బులు 365.53 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగిందని మార్కెటింగ్ అధికారి మంత్రికి తెలుపగా, ఈసారి ధాన్యం సేకరణలో తరుగు, తేమ పేరిట ఒక్క రైతు నుండి కూడా గింజ తగ్గింపు తీయలేదని, తీసుకున్న ధాన్యానికి పూర్తి చెల్లింపులు చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మార్పు సాధ్యమైందని ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
ఉద్యానవన శాఖ ద్వారా జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటల సాగును ప్రోత్సహించాలని, రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, పశు సంవర్ధక శాఖ, డి.ఆర్.డి.ఓ శాఖ పనితీరును పరిశీలిస్తూ ఈ.జి.ఎస్, ఆసరా పెన్షన్ లు, సెర్ప్ యాక్టివిటీస్ పెరగాలని చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు, స్వయం ఉపాధికి ప్రోత్సహించాలని, వైకుంఠధామాలలో, సెగ్రిగేషన్ షెడ్డుల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు పై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించడం జరిగింది, మెప్మా ద్వారా అర్బన్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి సమర్పించాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ కు సూచించారు. టూరిజం అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అందరం కలిసికట్టుగా పనిచేసే జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా మార్పు చేయాలని, ప్రణాళికలు రూపొందించుకొని పని చేద్దామని, ప్రభుత్వ పరంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలలో ముందుండాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ,, జెడ్పీ సి.ఈ.ఓ. శ్రీనివాస్, డి.ఆర్.డి.ఓ. శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే.ప్రమోద్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రమాకాంత్, డిపిఓ చంద్రమౌళి, డీ.ఎస్.ఓ. ఏ. ప్రేమ్ కుమార్, డి.ఎం. సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ అండ్ బి ఈ. ఈ., డి.పి.ఆర్.ఈ., తదితరులు పాల్గొన్నారు.



