డ్రోన్ ద్వారా ఎరువుల పిచికారి విధానం పరిశీలన.

అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో డ్రోన్ పరికరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

అగ్నిధారన్యూస్, అంతర్గాం:

వ్యవసాయంలో వచ్చే నూతన సాగు పద్ధతులు, సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకుంటూ అధిక లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో డ్రోన్ పరికరాన్ని ప్రారంభించిన అనంతరం డ్రోన్ పరికరం ద్వారా మార్తా రాములు వరి పొలంలో చేసిన ఎరువుల పిచికారి విధానాన్ని పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ…

రోజురోజుకు పెరుగుతున్న కూలీల కొరత కారణంగా రైతులు అధునాతన సాంకేతిక వైపు మల్లాలని, దీని వల్ల ఖర్చు, సమయం రెండు తగ్గుతాయని, సాంకేతికతను వినియోగిస్తూ అధికలాభాలు పొందే విధంగా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

డ్రోన్ పరికరాన్ని అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులు పల్లె రాజు, శ్యామ్ లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పెద్దపల్లి బ్రాంచ్ నుంచి 25 లక్షల రుణ సదుపాయం పొంది కొనుగోలు చేశారని, 20 లీటర్ల కెపాసిటీతో డ్రోన్ ట్యాంక్ ఉందని, దీని ద్వారా ఒక ఎకరం సంబంధించి ఎరువులు, విత్తనాలను 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో చల్లడం  పూర్తి చేయవచ్చని తెలిపారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి,  మండల వ్యవసాయ అధికారి బి.రాంబాబు, తహసిల్దార్, ఎంపీడీవో యాదగిరి, ఏ.ఈ.ఓ., సర్పంచ్, ఎంపిటిసి., సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.