అగ్నిధారాన్యూస్ (గోదావరిఖని) సింగరేణి లో ఉత్పత్తి పై శ్రద్ధ రక్షణ పై లేదని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సోమవారం జిడికే 2ఏ. ఇంక్లయిన్ లో గని ప్రమాదం జరిగిందని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు ఆరోపించారు. గని ప్రమాదం పై మాట్లాడుతూ….టబ్బులు హరియా అయ్యి మైనింగ్ సర్దార్ మందల సమ్మిరెడ్డి తీవ్ర గాయాల పాలు కావడం జరిగిందని, టబ్బుల లింకు తెగిపోయి కిందికి జారి మైనింగ్ సర్దారును ఢీకొనడం వల్ల కాళ్లు చేతులకు గాయాలు కావడమే కాకుండా, తలకు దెబ్బ తాకిందని తీవ్ర గాయాల పాలయ్యారన్నారు . ఉత్పత్తి లక్ష్యం చేరుకోవాలని ఆతృతలో రక్షణ చర్యలు గాని, జాగ్రత్తలు గానీ,తీసుకోకపోవడం , క్రమం తప్పకుండా రక్షణ సమావేశాలు నిర్వహించకపోవడం, చర్యలు గైకొనకపోవడం, తప్పనిసరిగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యమేనని ఆరోపించారు. ఈ ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు . రక్షనే ప్రథమం అనేది ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. కాగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం హుటాహుటిన ఏరియా హాస్పిటల్ కి వెళ్లి సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడి సమ్మిరెడ్డికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని కామినేని కార్పొరేట్ హాస్పిటల్ కు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పర్లపెల్లి రామస్వామి,వెంకట్ రెడ్డి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
