మొదలైన తిరుమలనాథుని ఉత్సవాలు

భక్తులకు కనీస సౌకర్యాలు కరువు

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా :

వనపర్తి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుమలయ్య గుట్టపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై నీలినీడలు తొలగటం లేదు.ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోవటం లేదు. ఆదాయం సమకూరుతున్నా వసతుల కల్పనకు ఒక్క రూపాయి ఉపయోగించడం లేదు. ఘనమైన చరిత్ర కలిగిన ఆలయంపై పాల కుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. తిరుమలనాథ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగు శనివారాల పాటు ఉత్సవాలు అంగరంగం వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ మాసం లో జరిగే ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. దీంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. గతేడాది కానుకల రూపంలో ఆలయానికి లక్షలు ఆదాయం వచ్చినప్పటికీ ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించటం లేదని భక్తులు పేర్కొంటున్నారు.ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చమని భక్తులు,వివిధ పార్టీల నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసిన గత ప్రభుత్వం నుంచి స్పందన లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ఆలయం నుండి పెబ్బేరు రహదారి వరకు వరకు డబుల్‌ రోడ్డు నిర్మించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా భక్తులు డిమాండు చేస్తున్నారు. స్వామి దర్శనానికి ఆలయకమిటీ సభ్యులు మంత్రులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌లకు ఆహ్వానం అందిస్తోంది. గతంలో నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఉత్సవాలకు హాజరై తిరుమలయ్య గుట్టను పర్యాటక ప్రాంతంగా చేస్తానని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నాయకులు ఇచ్చిన మాటలన్నీ కూడా నీటముటలే అయ్యాయని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆలయం ఆవరణలో కళ్యాణ మండపం, గుట్ట పైకి రోడ్డు, ఇతర మౌలిక వసతుల కల్పనకు జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే, అధికారులు స్పందించి పనులు ప్రారంభించాలని అంతా కోరుతున్నారు.

        ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

వనపర్తి జిల్లా సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్.

తిరుమలయ్య గుట్ట మీద వెలసిన తిరుమలనాథుని ఆలయ అభివృద్ధికి అన్ని పార్టీల నాయకులు, అధికారులు కృషి చేయాలి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం అభివృద్ధి చేయడం ఎంతో అవసరం. అలాగే దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఆలయం వరకు రోడ్డు సౌకర్యం,మౌలిక వసతులు కల్పించడం ఎంతగానో అవసరం. ఈ విషయంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.