అవినీతి ఆరోపణలే బదిలీకి కారణం..
రెగ్యులరైజేషన్ విషయంలో చేతివాటం..?
డిప్యూటేషన్ పై జిల్లా కార్యాలయానికి బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఓ ఆరిఫ్ ను జిల్లా కలెక్టర్ సోమవారం పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఒగా సూపరింటెండెంట్ శ్రీధర్ కు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం డిప్యూటేషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు కావాలని ఆదేశించారు.
ఎంపీఓపై అనేక ఆరోపణలే బదిలీకి కారణమైనట్లు తెలుస్తుంది.
అనేక ఆరోపణలు
మంథనిలో ఎంపీఓగా పనిచేసిన సమయంలో ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శులు వర్సెస్ ఎంపీఓ అన్నంతగా మంథని మండలంలో వివాదం చెలరేగి చిలికి చిలికి గాలి వానగా మారింది. పంచాయతీ కార్యదర్శులు దాదాపు 25 మంది మానసికంగా, ఆర్థికంగా వేధిస్తున్నాడని ఎంపీఓపై అప్పటి కలెక్టర్ ముసమిల్ ఖాన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెడ్పి సీఈవో నరేందర్ ను విచారణ అధికారిగా నియమించి ఎంపీఓపై విచారణ చేపట్టి హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యాలయాకి ఆనాటి కలెక్టర్ సరెండర్ చేశారు. ఎంపీఓపై తీసుకున్న చర్యలు ఏంటి అనే ఉత్తర్వులు రావడంతో, మరో మారు ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీహర్ష అప్పటి డి ఆర్ డి ఏ రవీందర్ ను విచారణ అధికారిగా నియమించి, విచారణ చేపట్టి అనంతరం ఆరిఫ్ హుస్సేన్ జూలపల్లి ఎంపీఓగా నియమించారు.
మారని తీరు
ప్రస్తుతం కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో గత కొంతకాలంగా ఆర్థికపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకువస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులను కూడా చేయాలని ఒత్తిడి పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలోని ఎంపీడీవోలకు, ఎంపిఓలకు ప్రజాపాలన కార్యక్రమంపై టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఓ ఆరిఫ్ హుస్సేన్ మండలంలో వ్యవహరిస్తున్న తీరు పైన ఆరా తీయడం, రెండు రోజులు గడవకముందే ఎంపీఓగా విధుల నుండి తప్పిస్తూ,జిల్లా పంచాయతీ కార్యాలయానికి డిప్యూటేషన్ పై పంపడంతో అసలేం జరిగింది. ఏం జరగబోతుంది అని జిల్లాలో చర్చనీయాంశంగా మారింది… ఎంపీఓపైన మరింత లోతుగా విచారణ చేపట్టి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ విషయంలో ఎంపీ ఓ వారి నుండి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన కాపీలో డి ఎఫ్ ఓ, డిఆర్డిఏ, జెడ్పి సీఈవో లకు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను పంపడం ఇక్కడ చర్చకు తెరలేపింది.

