అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా:
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జరుగుతున్న ఏదుల రిజర్వాయర్ పనుల్లో దౌర్జన్యం చోటుచేసుకుంది. భారీ వాహనాలతో పంట పొలం ధ్వంసం చేయడంతో మనస్థాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
ఏదుల మండల పరిధిలోని రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎం ఎన్ ఆర్ సంస్థ చేపట్టి, రివిట్‌మెంట్ మరియు రోడ్డు నిర్మాణ పనులను ఏదుల గ్రామానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డికి అప్పగించింది. ఈ పనులలో భాగంగా భారీ వాహనాలను రోజూ రైతు కొమ్ము ఆంజనేయులు పంట పొలం గుండా నడపడంతో పంట పూర్తిగా నాశనమైంది.
దీనిపై రైతు ప్రశ్నించగా, సబ్ కాంట్రాక్టర్ ప్రభుత్వం పనులకు అడ్డుగా వ్యవహరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో మనస్థాపానికి గురైన ఆంజనేయులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
రైతు మరణంతో ఆగ్రహించిన ఏదుల గ్రామ ప్రజలు మృతదేహంతో ధర్నాకు దిగారు. ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ, మాజీ జడ్పీ చైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, కార్యదర్శి మనివర్ధన్, మండల అధ్యక్షుడు రాము యాదవ్ తదితరులు మద్దతుగా చేరారు.
రైతు మరణానికి కారణమైన సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ చేయాలని, మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం గోపాల్పేట పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్నాడని, విచారణ అనంతరం రిమాండ్ చేస్తామని తెలిపారు.
ఇదే సమయంలో ఎమ్ ఎన్ ఆర్ సంస్థ ప్రతినిధులు రైతు కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. పోలీసు హామీతో గ్రామస్తులు ధర్నా విరమించి మృతదేహాన్ని దహనం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
