పుట్ట మధుపై టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 

రాజేష్ కాశిపాక ఘాటు వ్యాఖ్యలు.

అగ్నిధారన్యూస్ హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ కాశిపాక తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా -రాజేష్ కాశిపాక మాట్లాడుతూ..

పుట్ట మధు, మంత్రి శ్రీధర్ బాబుపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, పూర్తిగా రాజకీయా లబ్ది, కేవలం ఆయన వ్యక్తిగత ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నవే అని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయి, రాజకీయంగా కనుమరుగైపోతున్న పుట్ట మధు, మళ్లీ వెలుగులోకి రావాలనే తపనతోనే ఇలాంటి నిస్సిగ్గు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు పనితీరును విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు. మంథని నియోజకవర్గాన్ని గతంలో పాలించిన పుట్ట మధు, ఆ సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అకస్మాత్తుగా అభివృద్ధి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాజేష్ కాశిపాక అన్నారు. పుట్ట మధు ఆరోపించినట్లుగా శ్రీధర్ బాబు పాలనలో అవినీతికి ఆస్కారమే లేదు. ఒక పారదర్శకమైన, నిజాయితీగల నాయకుడిగా ఆయనకున్న పేరును దెబ్బతీయాలని చూస్తే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే, మంత్రి శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమల రంగంలో అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి, లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నాయకుడిపై ఆరోపణలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇప్పటికైనా పుట్ట మధు ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకొని, నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని రాజేష్ కాశిపాక డిమాండ్ చేసారు. లేదంటే ప్రజలు తప్పక తగిన గుణపాఠం చెప్తారని రాజేశ్ కాశిపాక హెచ్చరిస్తూ… తన ప్రకటనలో స్పష్టం చేశారు.