నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్
రాజీకి న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించాలి.
3 సంవత్సరాల లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు రాజీ చేయవచ్చు.
స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణ.
పత్రికా సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, నవంబర్-01:-
నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని , రాజీ చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. శనివారం
రంగంపల్లి లోని జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి
కే.స్వప్న రాణి తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత మాట్లాడుతూ..
లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ చేసుకోవాలనుకునే క్రిమినల్ ,సివిల్ కేసులకు లోక్ అదాలత్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు.ఇంటి గోడవలు, భూమి తగాదాలు యాక్సిడెంట్ కేసులు , భార్యాభర్తల వివాదాలు, చెక్ బౌన్స్ వంటి వివిధ కేసులను లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని అన్నారు.ప్రమాద కేసులు లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
3 సంవత్సరాలలోపు శిక్షపడే క్రిమినల్ కేసులు కూడా లోక్ అదాలత్ లో రాజీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇందులో పరిష్కారం చేసుకున్న కేసుల్లో మళ్ళీ ఉన్నత కోర్టులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని తెలిపారు.లోక్ అదాలత్ పట్ల గ్రామీణ ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నవంబర్ 15న నంది మేడారం సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, రామగుండం కోర్టులలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు దీనిని వినియోగించుకుని కేసులు రాజీ చేసుకోవాలని ఆమె కోరారు. లోక్ అదాలత్ లోనె కాకుండా కోర్టు సమయాలలో న్యాయ సేవాధికారి సంస్థ వద్దకు వచ్చి కేసు రాజీ చేసుకోవాలనుకుంటున్నాం అని తెలిపితే ఇరు పక్షాల వారిని పిలిచి చర్చించి రాజీ చేసేందుకు ప్రయత్నించడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
