అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని చారిత్రాత్మక విశేషం కలిగినటువంటి సంపద రామగిరి ఖిల్లా పైన అగ్నిధార ప్రత్యేక కథనం అక్కడికి ఇంతవరకు వెళ్లలేని వెళ్లొచ్చిన పాఠకుల కోసం ప్రత్యేకకథనం 
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన, విశాలమైన ఖిల్లా మన రామగిరి, రాముడు నడయాడిన రమ్యమైన రామగిరి, అలనాటి చారిత్రక కట్టడాలకు నిదర్శనమే ఈ ఖిల్లా. ఆయుర్వేద వనమూలికలకు భాండాగారం, విభిన్న జాతుల వృక్షాలకు నిలయం ఈ రామగిరి. ఆదిమ మానవులకు ఆవాసమైన తావు, ప్రకృతి ప్రేమికులకు సుగంధపు పరిమాళాలు వెదజల్లే సామ్రాని ఈ ఖిల్లా..శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకు పాలన కేంద్రమైన కీర్తికిరీటం రామగిరి.అనేకమైన జలపాతాలకు జన్మనించిన జనని,
ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ప్రపంచాన్ని సైతం మైమరపించే అధ్బుతమైన పర్యాటక యాత్ర క్షేత్రం. రామగిరి ఖిల్లా యాత్ర చేయాలంటే సాహసంతో సావాసం చేయాల్సిందే…ఈ రామగిరి ఖిల్లాను సందర్శించడానికి తెలంగాణాలోని వివిధ జిల్లాలతోపాటు,మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల వారు వస్తారు..
ఎక్కడ ఉంది.?

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్, రత్నాపూర్ గ్రామాల మధ్య..
ఎలా వేళ్ళాలి?
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంథని వేళ్ళే ప్రధాన రహదారిలో బేగంపేట్ ‘X’ రోడ్ వద్ద దిగి ఆటోల ద్వారా
బేగంపేట్ గ్రామంలోపలికి వేళ్ళి సుమారు 3 కి.లో మీటర్లు కాలినడకన ద్వారా ఈ ఖిల్లాను చేరుకోవచ్చు.
ఏ సమయంలో వెళ్ళాలి?
ప్రతి సంవత్సరం ఆగష్టు మరియు సెప్టెంబర్ మాసాలలో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఖిల్లాను సందర్శించడానికి వీలుంటుంది. ఉదయం 8 గంటల వరకే బేగంపేట్ గ్రామానికి చేరూకునే విధంగా చూసుకోవాలి..
యాత్ర చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు??
ఖిల్లా పై సుమారు 15-20 కిలోమీటర్లు కాలినడక చేయాలి కాబట్టి కాళ్ళకు షూస్ వేసుకోవడం మంచిది.
ఎక్కువ మోతాదులో త్రాగునీరు వెంటతీసుకొని మరియు అల్పాహారం ,భోజనం ముందుగానే తయారుచేసుకొని వెళ్ళాలి.
ఒంటరిగా వెళ్ళకుండా గుంపులుగా వెళ్ళాలి.
రామగిరి ఖిల్లాపై చూడదగ్గ ప్రదేశాలు….

7 కోట ప్రవేశదర్వాజాలు,మొదటి దర్వాజకి కుడివైపు వేళ్ళితే సముద్ర జలపాతం,రెండవ దర్వాజ ప్రవేశంలో కుడివైపు గోడపైన గల క్రీ.శ 1556 నాటి పది పంక్తులలో గల తెలుగు శాసనం(శాసనం వివారాలు:తుమ్మిఖాన్ అనే వ్యక్తి రెండవ దర్వాజ నిర్మాణానికి 10 వేల రుపాయాల ఖర్చు అయినట్టు అట్టి ఖర్చును పన్నురూపంలో స్థానిక ప్రజలు చెల్లించవలెనని ఉంది ),దర్వాజ ప్రవేశించిన తర్వాత ఎడమవైపు గల అధ్బుతమైన పచ్చని కోట మరియు 25 మీటర్ల పొడవు గల అతి పెద్ద ఫిరంగి, నాల్గవ దర్వాజ పై గల సృష్టిశిల్పాలతో పాటు,ఏనుగు తో పోరాడుతున్న యోధుడి శిల్పం,రెండు తలల గరుత్మంతుడి శిల్పం. 
పిల్లల ఫిరంగీ:సుమారు 15 మీటర్ల పొడవు గల ఫిరంగీని స్థానికులు పిల్లల ఫిరంగీ గా పిలుస్తారు ఇందులో నుంచి దూరితే సంతానంలేని వారికి పిల్లలు పుడుతారని, ఆయురారోగ్యాలతో జీవిస్తారని ప్రజల యొక్క విశ్వాసం.
ఆరవ దర్వాజ నుంచి 21 మెట్లు ఎక్కి కోటపైనుంచి కనిపించే మానేరువాగు వయ్యారాలతోపాటు
ఖిల్లాపై గల వివిధ చారిత్రక స్థలాలైన సీతమ్మ స్నానమాడిన కొలను, పసరుబావులు, పసుపు కంకుమ భరణీ, సవతుల బావులు,మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన రామలింగాలు,హనుమంతుడి విగ్రహం, చరశాలలు,గజశాలలు,అశ్వశాలలు,నీటి సౌకర్యాన్ని రాజమందిరానికి తరలించిన రాతినీటిగొట్టాలు,చివరగా సీతారాముల దేవస్థానాన్ని దర్శించుకుని సుమారు సాయంత్రం 5 గంటల వరకు యాత్ర ముగుస్తుంది..

తెలంగాణ లో అత్యంత పొడవైన మరియు విశాలమైన ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల రామగిరి ఖిల్లా ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసి ,ఖిల్లా వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించి యాత్ర మార్గ నిర్దేశక సూచికలను ఏర్పాటు చేయాలి అలాగే పెద్దపల్లి,గోదావరిఖని ,కరీంనగర్ ప్రధాన కేంద్రాలలో ఖిల్లా ప్రాధాన్యత ను తెలిపేలా పర్యాటక శాఖ వారు ప్రచార బోర్డులను పెట్టడంతోపాటు
అత్యాధునిక సౌకర్యమైన రోప్ వే ను ఖిల్లా దిగువ భాగం నుంచి పైకి నిర్మాణం చేస్తే నిత్యం పర్యాటకులతో కనువిందు చేస్తుంది.

పర్యాటక ప్రాంతంగా రామగిరి ఖిల్లా…!!

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
జిల్లాలోని రామగిరి ఖిల్లా ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి రామగిరి ఖిల్లా అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.రామగిరి ఖిల్లా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు, రామగిరి ఖిల్లా చరిత్ర, ప్రాముఖ్యత తదితర అంశాల పై కలెక్టర్ ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ…
పర్యాటకంగా రామగిరి ఖిల్లా అభివృద్ధి చేసేందుకు వీలుగా బేగంపేట నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.రామగిరి ఖిల్లా అభివృద్ధి చేయడం ద్వారా మన జిల్లాలో మంచి పర్యాటక ప్రాంతం ఏర్పాటు అవుతుందని, దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

