.. కుల గర్వానికి పసిప్రాణం బలి!

​ఆలయ ప్రవేశం చేశారని ఆరు గంటల పాటు నరకయాతన

​రెండు నెలల శిశువును తన్ని చంపిన ఉన్మాదులు

​నాగర్ కర్నూల్ జిల్లాలో గుండెలు పిండేసే ఘటన..

పోలీసుల తీరుపై మండిపడుతున్న జనం

​ అగ్నిధారన్యూస్- (నాగర్ కర్నూల్) :
కన్నతల్లి ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన ఆ రెండు నెలల పసికందు.. మనుషుల రూపంలో ఉన్న మృగాల అహంకారానికి బలయ్యింది. “నువ్వు తక్కువ కులం దానివి.. మా గుడిలోకి ఎలా వస్తావు?” అంటూ అగ్రవర్ణ దురహంకారం పడగ విప్పింది. దేవుని దర్శనానికి వెళ్లడమే ఆ కుటుంబం చేసిన నేరమైంది. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మానవత్వం మంటగలిసిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

​ఆరు గంటల నరకం..

​కుమ్మెర గ్రామానికి చెందిన సాకలి (రజక) కుటుంబం స్థానిక ఆలయానికి వెళ్లగా, అక్కడి అగ్రవర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. కులం పేరుతో దూషిస్తూ మహిళపై దాడికి దిగారు. సుమారు ఆరు గంటల పాటు ఆ కుటుంబాన్ని బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ క్రమంలో ఒక దుర్మార్గుడు కన్నతల్లి చేతుల్లో ఉన్న రెండు నెలల పసిగుడ్డును కాలితో బలంగా తన్నడంతో, ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ముక్కుపచ్చలారని పసిపాప ప్రాణాలు తీసిన ఆ కసాయిల చర్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

​రాజ్యం ఎవరి పక్షం?

: డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్

​ఈ ఘాతుకంపై సమత సైనిక్ దళ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ అగ్నిధారతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రపంచం చంద్రుడిపైకి వెళ్తుంటే, మన దగ్గర ఇంకా కుల వివక్షతో చంపుకుంటున్నారు. ఎస్సీలపై దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉండటం వల్లే, నేడు బీసీ కుటుంబాలపై కూడా ఈ స్థాయి దాడులు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటి? చట్టం కేవలం ఉన్నత వర్గాలకే చుట్టమా?” అని ఆయన నిలదీశారు.

డిమాండ్స్: దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి.
​పోలీసులపై చర్యలు: కేసు నమోదులో జాప్యం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.

​చలో నాగర్ కర్నూల్:

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ‘సమత సైనిక్ దళ’ ఆధ్వర్యంలో దళిత, బహుజన, వామపక్ష సంఘాలతో కలిసి భారీ పోరాట రథయాత్ర చేపడతామని నగేష్ హెచ్చరించారు.