బియ్యం తక్కువ తూకంపై ఆరోపణలు
అగ్నిధార న్యూస్,(రామగుండం): రామగుండం నియోజకవర్గంలోని 41వ డివిజన్ రేషన్ షాప్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యంలో తూకం లోపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమాచారం ప్రకారం, ఒక రేషన్ షాప్లో 72 కిలోల బియ్యం రావాల్సి ఉండగా, పక్కనే ఉన్న మరొక షాప్లో కేవలం 68 కిలోలే అందుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై నిర్వాహకులను ప్రశ్నించగా “కంప్యూటర్ కేటాయింపు ప్రకారమే వస్తుంది” అంటూ సమాధానం చెప్పడం ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక్కో కుటుంబానికి సుమారు 4 కిలోల వరకు బియ్యం తక్కువగా అందుతోందని, ఇదే పరిస్థితి సుమారు 3000 మంది లబ్ధిదారులకు వర్తిస్తే భారీగా బియ్యం మిగులుతుందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మిగిలిన బియ్యం ఎక్కడికి వెళ్తుందన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారుడు గూడెపు రణధీర్ మాట్లాడుతూ, “రేషన్ బియ్యం పంపిణీలో జరుగుతున్న ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పేద ప్రజలకు న్యాయం జరిగేలా అధికారులు వెంటనే స్పందించాలి” అని డిమాండ్ చేశారు. ఇలాంటి అక్రమాలు ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిజానిజాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
