ఆక్రమణలను అడ్డుకోవాలని మత్స్యకారుల విజ్ఞప్తి.
అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి)
ప్రభుత్వ ఆస్తూలు అయిన చెరువులు, కుంటలను ఆక్రమించి వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించేందుకు ప్రయత్నిస్తున్న ఆక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కారుపాక సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 389లో ఉన్న ‘ధర్మయ్య కుంట: 10 ఎకరాల 8 గంటలు అలాగే 376 సర్వే నెంబర్ లోని 3ఎకరాల 25గుంటలు
ఉన్న ‘మెసమ్మ కుంట’లను ప్రభుత్వ రికార్డుల్లో మైనర్ ట్యాంకులుగా నమోదు చేశారని ఆయన ఫిర్యాదులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమంలో భాగంగా ఈ చెరువులను పునరుద్ధరించి సాగునీటి సౌకర్యం కల్పించినప్పటికీ, కొందరు వ్యక్తులు రికార్డులను తప్పుదోవ పట్టిస్తూ చెరువులను పూడ్చివేసి ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టిని నింపడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో గ్రామ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగించే ఇటువంటి అక్రమ చర్యలను వెంటనే అడ్డుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన సంపత్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్, ఫిషరీస్ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించి చెరువుల హద్దులను ఖరారు చేయాలని కోరారు. అదేవిధంగా సంబంధిత సర్వే నంబర్లను సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితాలో చేర్చి అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని కోరారు. విలువైన భూమిని ఇలాగే వదిలితే భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ ప్లాట్స్ పెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మత్స్యకారుల జీవనోపాధి, గ్రామ ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి చెరువులను రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
