గుంతల మయంగా మంథని – చిన్న ఓదాల రోడ్డు విద్యార్థుల నరకయాతన.
మారదా ఈ దుస్థితి..! బండి చక్రం అదుపు తప్పితే ఇక సెలవే.
నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు, ప్రయాణికులు.
అగ్నిధారన్యూస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రానికి పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని గ్రామాల పరిస్థితి ఇది.. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని విధంగా, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి.
మంథని మండలంలోని *గోపాల్ పూర్, చిన్న ఓదాల, జిల్లాలపల్లి* గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి. మంథని మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పంట పొలాలకు వెళ్లే రైతులు, విత్తనాలు, ఎరువులు తెచ్చుకునేందుకు, అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా.. ఈరోడ్డే ఆధారం.
కానీ ఈ రోడ్డు పరిస్థితి చూస్తే నరకానికి నకలు అన్నట్లు కనిపిస్తుంది. కన్నీళ్లు వస్తాయి. మోకాలి లోతు గుంతలు.. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు గుంతల్లో నీళ్లు నిలిచి చెరువును తలపిస్తోంది. ద్విచక్ర వాహనదారులు, ఆటోల్లో వెళ్లే విద్యార్థులు, .. ప్రతి ఒక్కరూ భయం భయంగా ప్రయాణం చేయాల్సిందే. బండి చక్రం .. అదుపు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం.
అసలు కారణం ఏంటి…?
గోపాల్ పూర్ శివారులోని *మానేరు వాగు* నుండి ఇసుకను తరలిస్తున్న భారీ లారీలే ఈ దుస్థితికి కారణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వందలాది లారీలు ఇదే రోడ్డుపై నుంచి వెళ్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రభుత్వానికి మానేరు ఇసుక ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా, ఆ ఆదాయంలో ఒక్క శాతం కూడా ఈ రోడ్డు మరమ్మత్తుకు ఖర్చు చేయడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి, విద్యార్థుల ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని, కొత్త రోడ్డు వేయాలని గోపాల్ పూర్, చిన్న ఓదాల, జిల్లాలపల్లి గ్రామాల ప్రజలు సంబంధిత శాఖ అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.
లేని పక్షంలో రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ రోడ్డు దుస్థితిపై అధికారులు ఎప్పుడు కళ్లు తెరుస్తారో చూడాలి.
