వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ.
18న జరిగే సీఎం సమావేశానికి సంపూర్ణ సమాచారంతో సన్నద్ధం కావాలి.
143297 మంది రైతులకు 137.7 కోట్ల రైతు బంధు సొమ్ము సిద్ధం.
ధాన్యం కొనుగోలు నిలిపివేసిన ఎఫ్.సి.ఐ
సోంత పూచికత్తు పై మాత్రమే రైతులు వరి సాగు చేయాలి.
ప్రత్యామ్నాయ పంట సాగు పై వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్.
పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లాలో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయం పంట సాగు ఆవశ్యకతను రైతులకు వివరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంట సాగు పై గురువారం వ్యవసాయాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డిసెంబర్ 18న వ్యవసాయ శాఖ పై నిర్వహించే సమీక్ష కు సంపూర్ణ సమాచారంతో సన్నద్దం కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ యాసంగి లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో కనీసం 51 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించి పని చేస్తుందని అధికారులు వివరించారు.
జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ కు తెలిపారు. రైతులకు ప్రభుత్వం అమలు చేసే రైతుబంధు రైతు బీమా పథకాల పై కలెక్టర్, అధికారులతో చర్చించారు. ప్రస్తుత యాసంగి సీజన్ లో జిల్లాకు చెందిన 143297 మంది రైతులకు పంపిణీ చేసేందుకు 137.37 కోట్ల రూపాయలు ప్రభుత్వం సిద్ధం చేసిందని కలెక్టర్ తెలిపారు.యాసంగి లోఎఫ్.సి.ఐ దాన్యం కొనుగోలు చేయడం లేదని,రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యమ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కందులు, పెసర, తదితర పంటలు పండించేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని అన్నారు. మన జిల్లా పరిధిలో గత యాసంగి సీజన్ లో సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని, వచ్చే యాసంగి సీజన్ లో కోనుగోలు కేంద్రాలు ఉండవని, ఈ అంశం రైతులకు అర్థం అయ్యే విధంగా చెప్పాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, మండల ఎ.ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
