గోదావరిఖని అగ్నిధార న్యూస్ సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి సాధించి, కోట్లాది రూపాయలు సంస్థకు లాభాలు తీసుకువస్తే, యాజమాన్యం కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్ట కుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంక్షేమ పథకాలకు అప్పనంగా ఖర్చు పెడుతుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు.మంగళవారం గోదావరిఖని టు ఇంక్లయిన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోదావరిఖనిలో ఏర్పాటు చేసే మెడికల్ కళాశాలకు సింగరేణి యాజమాన్యం 500 కోట్ల రూపాయలు కార్మికుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడాన్ని ఏఐటియుసి వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఒక వైపు కార్మికుల వేతనాలు చెల్లించేందుకు సంస్థలో డబ్బులు లేవని, వివిధ ఆర్థిక సంస్థలలో బాండ్లు పెట్టి అప్పులు తెస్తున్న యాజమాన్యం మెడికల్ కళాశాలకు 500 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు అభివృద్ది పేరుతో ఇస్తూ, సంస్థ ను దివాళా తీసే విధంగా యాజమాన్యం చర్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. సింగరేణి లో కేంద్ర ప్రభుత్వ వాటా 49శాతం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి లో చేస్తున్న ఆర్థిక దోపిడి పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం లో మెడికల్ కళాశాల ఏర్పాటు కు ఏఐటియుసి వ్యతిరేకం కాదని, సింగరేణి సొమ్మును వాడు కోవడాన్ని వ్యతిరేకమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాజమాన్యానికి బొగ్గు, విద్యుత్ వాడుకున్నందుకు 14,500/- కోట్ల రూపాయలు బాకీ ఉందని, వాటిని ఇప్పించడం లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకుందని, టిఆర్ఎస్ కు చెందిన పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేయడం లో వైఫల్యం చెందారని ఆయన పేర్కొన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎం.పి లు అడిగిన ప్రశ్నకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగలేదని చెప్పారని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కి చెందిన నిధులు సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వేల్పుల నారాయణ,మేరుగు రాజయ్య, మడ్డి ఎల్లా గౌడ్, రంగు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి,గండి ప్రసాద్, చెప్యాల మహేందర్ రావు, మిట్ట శంకర్, పొన్నాల వెంకటయ్య, పెద్దల్లి శంకర్,పి.మహెందర్,చెలుకలపల్లి రమేష్, నీలం రవి కుమార్,మోర శ్రీ కాంత్,పంజాల రవి, ఎం.జోసెప్ తదితరులు పాల్గొన్నారు.
