*మంత్రి వర్యా..!పంచాయతీలో పైసల్లేవంటా..!*

*-పాలకుర్తిలో వారంరోజులుగా వెలుగని వీధి దీపాలు*

*-మేజర్ గ్రామ పంచాయతీలో నిధులు లేవంటున్న కార్యదర్శి*

*-బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం*

*-ప్రజ సమస్యలను*
*పట్టించుకోని కార్యదర్శిని సస్పెండ్ చేయాలి*

*బిజెపి పట్టణ అధ్యక్షుడు దుంపల సంపత్*

*అగ్నిధార న్యూస్ -పాలకుర్తి:*

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్
,గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పలు రకాల సమస్యలు పేరుకు పోయి విలయ తాండవం చేస్తున్నాయని బిజెపి పట్టణ అధ్యక్షుడు దుంపల సంపత్ ఆరోపించారు.సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
మాట్లాడుతూ రూ. 63 లక్షల మిగులు బడ్జెట్ తో కొలువు తీరిన పాలకుర్తి గ్రామపంచాయతీలో నేడు వీధి దీపాలు వేయలేని దీనస్థితిలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో
పలు కాలనీలలో పదిహేను రోజులుగా వీధి దీపాలు వెలగడం లేవని పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి పిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
రెండు సంవత్సరాలుగా పారిశుద్ధ్య పనులతో పాటు దోమల నివారణ చర్యలు తీసుకోకుండా డ్రైనేజీ వ్యవస్థతో ఆపరిశుభ్రంగా తయారైందని దుయ్య బట్టారు.కమిషన్లు వచ్చే పనులకు మాత్రమే పెద్ద పీట వేస్తూ ప్రజా సమస్యలపై అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు.గత గ్రామ సభలో గ్రామ సమస్యలపై లిఖిత పూర్వకంగా వినతి పత్రం ఇచ్చి నేటికి ఆరు నెలలు కావస్తున్నా అతిగతి లేదన్నారు.
గ్రామ పంచాయతి అభివృద్ధి, సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నాయని గుర్తు చేశారు.అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంతో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
పంచాయతీరాజ్ మంత్రి నియోజకవర్గంలో సమస్యలు విలయ తాండవం చేస్తున్న ఇవేమీ పట్టించు కోకుండా అభివృద్ధి చెందుతుందని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మాటలతో కాదు అభివృద్ధి చేతలలో చూపెట్టాలని సవాల్ విసిరారు.రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన రెండవ గ్రామపంచాయతీలో పైన పటారం లోన లొటారంలా ఉందని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ప్రజా సమస్యలపై గ్రామ పంచాయతీ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఓబిసీ మండల అధ్యక్షులు పెనుగొండ సోమేశ్వర్, బిజెవైఎం మండల అధ్యక్షులు పూజారి మహేష్,పట్టణ ప్రధాన కార్యదర్శి జివాంజి ప్రసాద్ పాల్గొన్నారు.