■ *అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ 2*
■ *కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూములు*
■ *జిల్లాలో అన్యాక్రాంతమౌతున్న కుంటలు చెరువులు చోద్యం చూస్తున్న అధికారులు*
■ *లెక్కల్లో తేడాలు సమన్వయ లోపాలు*
■ *కొత్తపల్లిలో,కనుమరుగవుతున్న కుంటలు*
■ *జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది*
*అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )* కెసిఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ కాకతీయ’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని చెరువుల ,కుంటలలో ఉన్న మట్టిని విడతలవారీగా తొలగించి సుందరీకరణ చేసి వాటికి మహర్దశ పట్టించి పూర్వ వైభవం తేవాలని సంకల్పించారు.దీనివల్ల కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిన కుంటలు చెరువులను రక్షించుకొని మట్టిని తొలగించి జలకళ ఉట్టి పడేలా ప్రయత్నాలు చేపట్టొచ్చు, తద్వారా రైతులకు రెండు పంటలకి సాగునీరు అందుతుంది. రైతు బతుకు బాగు పడుతుందని, భూగర్భ జలాలు పెంపొందించవచ్చు అనేది ఉద్దేశ్యం.పనులు చేపట్టిన చెరువులు ,కుంటలలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. పూర్తయిన కుంటలు చెరువులు నిండుకుండలా మారాయి . ఇంతవరకు బాగానే ఉంది కానీ…… రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక,రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టును పక్కన పెట్టింది. దానితో మరమ్మతులు ఆగిపోయాయి…..ఇదే అదనుగా భావించిన భూ బకాసురులు కనపడిన కుంటను చెరువునల్లా ఖతం*( కబ్జా )*చేయడం మొదలుపెట్టారు. అదే వరస రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కొనసాగుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలోని, 14 మండలాల పరిధిలోని , గ్రామాలలో, వందల సంఖ్యలో కుంటలు, చెరువులు భూ బకాసురుల కబంధహస్తాల్లో కనుమరుగవుతున్న తీరు చూస్తావుంటే రాబోయే రోజుల్లో మరిన్ని నామరూపాల్లేకుండా చేస్తారు, అనడంలో ఎలాంటి సందేహమే లేదు.రక్షించాల్సిన అధికార యంత్రాంగం తమకు పట్టనట్టు వ్యవహరిస్తుంది. పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాలతో పాటు పెద్దపల్లి మండలంలోని 23 రెవెన్యూ గ్రామ పంచాయతీలలో ఎన్ని అన్యాక్రాంతం అయ్యాయో సమగ్రచర్యలు గైకొన్నట్లయితే తేలిపోతుంది. పెద్దపల్లి మండలలో…. కొత్తపల్లి, మూలసాల, భోజన పేట ,హనుమంతునిపేట, పెద్దబొంకూర్ రాంపల్లి, మారేడుగొండ, పెద్దకాల్వల గౌరెడ్డి పేట, రంగాపూర్, రాఘవపూర్, పాలితం, మొదలగు గ్రామాలతో పాటు, మిగితా గ్రామాలలో, భూబకాసురులు భూఆక్రమణలకు పాల్పడ్డారు. అన్యాక్రాంతం అవుతున్న చెరువులు, కుంటలు రక్షించాల్సిన బాధ్యతను రెవెన్యూ శాఖది అయినప్పటికీ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ భాగంగా ఇరిగేషన్ శాఖకు కుంటలు చెరువులతో ముడిపడిన ఉన్న సంబంధం వల్ల రెవెన్యూ శాఖ ,నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో ముందుకు వెళితే ఫలితం ఉంటుంది కానీ, ఇక్కడ సమన్వయ లోపం అనేది రెండు శాఖల మధ్య స్పష్టంగా కనబడుతుంది.రెవెన్యూ రికార్డుల ప్రకారం పెద్దపల్లి మండలంలో 23 రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలో 84 చెరువులు కుంటలు 4068 ఎకరాలుగా నమోదై ఉండగా. నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం 105 కుంటలు చెరువులు 5179 ఎకరాలుగా రికార్డు అయి ఉంది. దీనికితోడు సంబంధిత శాఖల అధికారులు అగ్నిధారతో మాట్లాడిన విధానం చూస్తే సమన్వయ లోపం ఉన్నదనేది స్పష్టమైంది. ఏదేమైనప్పటికీ మండలంలో కనుమరుగవుతున్న కుంటలు,చెరువులను కాపాడాల్సిన బాధ్యతను సంబంధిత శాఖ అధికారులు వెంటనే చేపట్టనట్లయితే ఇప్పటికే కనుమరుగైపోయిన కుంటల మాదిరిగానే మరెన్నో కనబడకుండా పోయే ప్రమాదం వాటిల్లుతుంది. తద్వారా నేటికీ కుంటలు, చెరువులు నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న చిన్న, సన్నకారు రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా మత్స్యకారుల జీవనోపాధి మీద రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. భూగర్భజలాలు అడుగంటి పోతాయి.మూగజీవాలకు పశుపక్ష్యాదులకు తాగు నీరు దొరకని దుస్థితి దాపురిస్తోంది. కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కిన కుంట.
