■ అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ.
అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి జిల్లా)
ఆహార భద్రత చట్టంలో భాగంగా ప్రజలకు పౌష్టికాహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జాతీయ ఆహార భద్రతా చట్టం -2013 జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, పూర్వపు రోజుల్లో ఆహార కొరత తీవ్ర సమస్యగా ఉండేదని, దీని పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేసాయని అన్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలో కరువు కాటకాల కారణంగా అనేక మంది మరణించారని అన్నారు. ప్రస్తుతం యూతోఫియా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొని ఉందని తెలిపారు.మన భారతదేశంలో 1975 తరువాత ఆహార సంక్షోభాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించ గలిగామని, ప్రస్తుతం ఆహార నిల్వలకు ఎలాంటి కొరత లేదని ఆయన అన్నారు. ఆహార సంక్షోభం ముగిసిన అనంతరం ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాలు తీసుకుని వచ్చిందని, అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు.ప్రస్తుత సమాజంలో సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో శారీరిక పనులు తగ్గుతున్నాయని, దీని ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు.దేశంలో ఏ ఒక్క పౌరుడు ఆకలితో ఉండవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందించి ఆహార పదార్థాలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో డి.ఆర్.డి. ఓ.శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్, డి. డబ్ల్యూ.ఓ. రౌఫ్ ఖాన్, డి. ఈ. ఓ. మాధవి, పౌరసరఫరాల అధికారి తోట వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

