ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు.

గతం కంటే ప్రభుత్వ ఆసుపత్రులలో రెట్టింపైన ప్రసవాలు.

ప్రతి మాసం సరాసరి 200 కు పైగా పెరిగిన ప్రసవాలు.

గణనీయంగా పెరుగుతున్న జనరల్ సర్జరీలు, ఆర్థోపెడిక్ సేవలు.

ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని డి.సి.హెచ్.ఎస్ పిలుపు.

టీవీవీపి ద్వారా మెరుగైన వైద్య సేవలు.

     డి.సి.హెచ్.ఎస్ డా.కె.శ్రీధర్.

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లిజిల్లాలో పేద ప్రజలకు అండగా సర్కారు వైద్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం , సుల్తానాబాద్ , మంథని ఆరోగ్య కేంద్రాలలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది.

ఈ ఏడాది మే 3న వైద్యారోగ్య శాఖ మంత్రిచే మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకున్న తరువాత ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. హై రిస్క్ కేసులను సైతం కరీంనగర్ ఆసుపత్రికి తరలించకుండా పెద్దపల్లిలోనే మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు.

టీవీవీపీ ఆసుపత్రులలో గణాంకాలు పరిశీలిస్తే పెద్దపల్లి ఆసుపత్రిలో ఆగస్టు నెలలో 140 ప్రసవాలు, సెప్టెంబర్ నెలలో 180 ప్రసవాలు, అక్టోబర్ నెలలో అత్యధికంగా 244 ప్రసవాలు, నవంబర్ నెలలో 215 ప్రసవాలు జరిగాయి. గతంలో నెలకు కేవలం 100 నుంచి 120 మాత్రమే జరిగే ప్రసవాలు గత 4 మాసాలుగా సరాసరి 200 కు పైగా నమోదు కావడం జరిగింది.

సుల్తానాబాద్ 30 పడకల ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తృతంగా అందించడంతో పాటుగా, ప్రత్యేకంగా గైనకాలజిస్ట్, అనస్థీషియా, పెడిట్రిషియన్ వైద్యులను నియమించి గతంలో నెలకు జరిగే 15 ప్రసవాల సంఖ్య ను 40 కు పెంచడం జరిగింది. మంథని ఎం.సి.హెచ్. ను సన్నద్దం చేసి నెలకు 40 ప్రసవాలు నిర్వహించడం జరుగుతున్నది.

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలతో పాటు జనరల్ సర్జరీలు, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు గణనియంగా పెరుగుతున్నాయి. పెద్దపల్లి ఆసుపత్రిలో గత నెల ఆరోగ్య శ్రీ కింద 50 జనరల్ సర్జరీలు, 10 ఆర్థోపెడిక్ ఆపరేషన్లను నిర్వహించగా, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలను పేదలకు అందిస్తున్నారు.

ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించేందుకు, ఆస్పత్రులలో రోగులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు అవసరమైన పారిశుద్ధ్య, డైట్ టెండర్లు పూర్తి చేసి ఏజెన్సీల ద్వారా పకడ్బందీ సేవలు అందిస్తున్నారు.

జిల్లాలో టీవీవీపి పరిధిలో 7 గురు ఎం.బి.బి.ఎస్ వైద్యులు, 3 ప్రత్యేక వైద్యు (పిల్లల వైద్యనిపుణులు, ఈ.ఎన్.టి) నిపుణులు, మొత్తం 10 మందిని తాత్కాలికంగా నియమించి ప్రజలకు సేవలందిస్తున్నారు.

పెద్దపల్లిలో డయాలిసిస్ సెంటర్ మంథనిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు

పెద్దపల్లి ఆసుపత్రిలో మంజూరు చేసిన 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు, 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు ఏంఓయూ పూర్తి చేయడం జరిగింది, త్వరలో పెద్దపల్లిలో ప్రభుత్వ రంగంలో డయాలసిస్ సేవలు ప్రజలకు అందుబాటులో వస్తాయి. మంథని ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

మెరుగైన వైద్య సేవలు పెద్దపల్లిలో లభ్యం

ప్రజలు మెరుగైన వైద్య సేవలు కోసం కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం లేదని, పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో లభ్యమవుతాయని డి.సి.హెచ్.ఎస్ డా.కె.శ్రీధర్ తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డి.సి.హెచ్.ఎస్ కోరారు. ఆసుపత్రి కి వచ్చే రోగులు, సహాయకులతో ప్రేమగా, మర్యాదగా ప్రవర్తించేలా వైద్య, నర్సింగ్, పారిశుద్ధ్య సిబ్బంది శిక్షణ అందించామని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఈ.ఎన్.టి , అబ్ స్ట్రాటిక్స్ మొదలైన వివిధ రకాల స్పెషలిస్టులతో వైద్య సేవలు విస్తృతంగా అందిస్తున్నామని అన్నారు.

పెద్దపల్లి ఆసుపత్రిలో ఆర్థికంగా భరించే వారి కోసం ప్రత్యేక పేమెంట్ గదులు అందుబాటులో ఉన్నాయి, వీటి ద్వారా వచ్చే ఆదాయం ఆసుపత్రి అభివృద్ధికి వినియోగిస్తున్నామని, త్వరలో ఆసుపత్రికి వచ్చే రోగులు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు చర్యలు చేపట్టామని , ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులలో డబ్బులు వృధా చేసుకోవద్దని , ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.